ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఖుషీనగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వేర్వేరుగా పరిహారం ప్రకటించారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేయనున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించారు.

ఈ విషాద ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదించాలని సంబంధింత అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించినట్టుగా యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియాలో గత రాత్రి వివాహ వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు బావిలో పడి 13 మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఆరుగురు బాలికలు ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి వేడుకకు హాజరైన పలువురు మహిళలు, పిల్లలు పాత బావిని కప్పి ఉంచిన స్లాబ్‌పై కూర్చున్నారు. అయితే బరువుకు స్లాబ్ కూలిపోవడంతో పైన కూర్చున్న వారు బావిలో పడిపోయారు. వారిని వెంటనే బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అయితే 13 మంది మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై గోరఖ్‌పూర్ జోన్ ADG అఖిల్ కుమార్ మాట్లాడుతూ.. మరణాల సంఖ్య 13 కి చేరుకుందని తెలిపారు. ‘ఈ సంఘటన గత రాత్రి 8.30 గంటలకు కుషినగర్‌లోని నెబువా నౌరంగియాలో ఓ వివాహ కార్యక్రమంలో జరిగింది. ఒక బావిని కప్పి ఉంచే స్లాబ్‌పై కొంతమంది కూర్చుని ఉన్నప్పుడు జరిగింది. బరువుకు స్లాబ్ విరిగిపోయింది’ అని అఖిల్ కుమార్ తెలిపారు.