దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తులో జిల్లా కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సర్కార్ నష్ట నివారణా చర్యలకు ఉపక్రమించింది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ లక్సర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 15 మంది అధికారులను కూడా బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. ఆయన స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ జల్‌ నిగమ్‌ అదనపు ఎండీగా ఉన్న రమేశ్‌ రంజన్‌ను హాథ్రస్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ప్రవీణ్ కుమార్‌ను మీర్జాపూర్‌ జిల్లాకు బదిలీ చేసింది.

కాగా, హాథ్రస్‌కు చెందిన ఓ దళిత బాలికపై గత ఏడాది సెప్టెంబర్‌ 14న అగ్ర కులానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

అయితే పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ అధికారులు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు. గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పలు రకాల పరీక్షలు నిర్వహించారు. అత్యాచార ఘటన అనంతరం తొలుత బాధితురాలు చికిత్స పొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ వైద్యులను సైతం విచారించారు.

అలాగే, బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం ఛార్జిషీటును దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అలహాబాద్ హైకోర్టు కేసు విచారణను పర్యవేక్షిస్తోంది.