Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్‌లో వరద బీభత్సం: 11 జిల్లాల్లో అతలాకుతలం, యోగి సర్కార్ అప్రమత్తం

ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, పిఏసి బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

UP Floods: CM Yogi Orders Swift Relief Measures in 11 Affected Districts AKP
Author
First Published Sep 30, 2024, 10:17 AM IST | Last Updated Sep 30, 2024, 10:17 AM IST

లక్నో : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో వరద పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఈ వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కుషీనగర్, మహారాజ్‌గంజ్, లఖింపూర్ ఖేరీ, బలియా, ఫరూకాబాద్, గోండా, కాన్పూర్ నగర్, జీబీనగర్, సీతాపూర్, హర్దోయ్, షాజహాన్‌పూర్ జిల్లాల అధికారులను సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అధికారులు స్వయంగా వరద ప్రాభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. వరద బాధితులకు అన్ని విధాలా సాయం అందించాలని ఆదేశించారు.

సీఎం యోగి ఆదేశాల మేరకు వరద ప్రభావిత జిల్లాల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, పిఏసి బృందాలను మొహరించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని, తద్వారా బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్లను సీఎం యోగి ఆదేశించారు. ఇళ్లు, పశువులు కోల్పోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు.

కుషీనగర్‌లో 10 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలింపు

సీఎం యోగి ఆదేశాల మేరకు వరద ప్రభావిత 11 జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సహాయక కమిషనర్ భాను చంద్ర గోస్వామి తెలిపారు. ప్రస్తుతం కుషీనగర్ జిల్లాలోని ఒక తాలూకాలోని ఐదు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని... గండక్ నది ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. 8 వేల మంది వరద ప్రభావానికి గురయ్యారని, 16 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 42 పడవలను సిద్ధంగా ఉంచామని, ఎన్డీఆర్ఎఫ్, పిఏసి బృందాలను మోహరించామని చెప్పారు.

శివ్‌పూర్ గ్రామంలో చిక్కుకుపోయిన 10 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మహారాజ్‌గంజ్ జిల్లాలో గండక్ నది ఉప్పొంగడంతో ఓ గ్రామం వరద ముంపునకు గురైందని... అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం 55 పడవలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.బాధిత ప్రజలకు  భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు భాను చంద్ర గోస్వామి వెల్లడించారు. 

ఎన్డీఆర్ఎఫ్, పిఏసి బృందాలను మొహరించామని, వరద నీరు పెరుగుతుండటంతో చాలామందిని సహాయక శిబిరాకు తరలించామని తెలిపారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో నాలుగు తాలూకాల పరిధిలోని 11 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, ఏడు గ్రామాల్లో నది కోతకు గురవుతున్నాయని, 19,500 మంది ప్రభావితులయ్యారని తెలిపారు. వీరికోసం 14 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, 26 పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు., 

బలియాలో ఇదీ పరిస్థితి

బలియా జిల్లాలో మూడు తాలూకాల పరిధిలోని 18 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని... ఐదు గ్రామాలు నది కోతకు గురవుతున్నాయని... తొమ్మిది గ్రామాల్లో పంటలు నీట మునిగాయని రాష్ట్ర సహాయక కమిషనర్ వెల్లడించారు. ఈ జిల్లాలో 8,300 మంది వరదలకు ప్రభావితులయ్యారని.. 71 సహాయక శిబిరాలను ఏర్పాటు చేయగా మూడు శిబిరాలు పనిచేస్తున్నాయని... ఇందులోో 700 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.15 పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని... మరో 202 పడవలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

ఫరూకాబాద్ జిల్లాలో ఒక తాలూకాలోని ఒక గ్రామం వరద ముంపునకు గురైందని... 350 మంది ప్రభావితులయ్యారని తెలిపారు. ఈ జిల్లాలో 24 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, రెండు పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, 15 పడవలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. 

గోండా జిల్లాలోని ఒక తాలూకాలోని మూడు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, ఘాగ్రా నది ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొందని వెల్డించారు. 452 మంది ప్రభావితులయ్యారని, 31 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, మూడు పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, 92 పడవలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.  ఎస్డీఆర్ఎఫ్, పిఏసి బృందాలను మొహరించామని తెలిపారు. కాన్పూర్ నగర్, జీబీనగర్, సీతాపూర్, హర్దోయ్, షాజహాన్‌పూర్ జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios