యూపీ కాంగ్రెస్ బుధవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఉన్నతి విధాన్ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ప్రియాంక గాంధీ విడుదల చేశారు. యూపీలో తొలి దశ పోలింగ్ రేపు జరగనుంది. 

UP Election News 2022 : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్‌కు ఒక రోజు ఉండ‌గా కాంగ్రెస్ (congress)త‌న మేనిఫెస్టో (menifesto) విడుద‌ల చేసింది. ‘ఉన్న‌తి విధాన్ (Unnati Vidhan)’ పేరుతో రూపొందిన ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ (priyanka gandhi) ల‌క్నో (lacknow)లో బుధ‌వారం ఆవిష్క‌రించారు. ఈ మేనిఫెస్టో ప్ర‌ధానంగా మహిళలు, రైతులు, చిన్న వ్యాపారుల సాధికారత, అభ్యున్నతిపై దృష్టి సారించింది. 

ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రియాంక గాంధీ మాట్లాడారు. “ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ అభివృద్ధి, సంక్షేమాన్ని ఎజెండాగా భావించే పార్టీని ఎన్నుకుంటార‌ని కాంగ్రెస్ విశ్వ‌సిస్తోంది. అలాంటి రాజకీయ వ్యవస్థ రాష్ట్ర ప్రజలకు అవసరం. అది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. యూపీ కాంగ్రెస్‌కు చెందిన ఉన్నతి విధాన్ దీనికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలు ఇవే.. 
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 రోజుల్లో రైతుల రుణమాఫీ అమలు చేస్తామని మేనిఫెస్టో తెలిపింది. విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తామని, అలాగే కోవిడ్ (covid) కాలానికి సంబంధించిన బకాయిలు మాఫీ చేస్తామని చెప్పింది. కోవిడ్ -19 (covid -19) ద్వారా ప్రభావితమైన కుటుంబాలకు రూ. 25,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. 40 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని పేర్కొంది. 

పారిశ్రామికవేత్తల కోసం రూ.5 వేల కోట్ల సీడ్ స్టార్టప్ ఫండ్ (seed startup fund) ఏర్పాటు చేస్తామ‌ని కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొంది. కోవిడ్ తో మృతి చెందిన ఫ్రంట్ లైన్ కార్మికుల (fornt line workers) కుటుంబాల‌కు రూ.50 లక్షల పరిహారం అందిస్తామ‌ని తెలిపింది. 2 లక్షల టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని, సంస్కృతం, ఉర్దూ టీచర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పింది. 

వరి, గోధుమలను క్వింటాల్‌కు రూ.2500, చెరకు క్వింటాల్‌కు రూ.400 చొప్పున కొనుగోలు చేస్తామ‌ని చెప్పింది. వికలాంగ మహిళల పెన్షన్‌ ను నెలకు రూ.3 వేలకు పెంచుతామ‌ని హామీ ఇచ్చింది. మహిళా పోలీసులను వారి స్వగ్రామాల్లో నియమించుకునేందుకు అనుమతి ఇస్తామ‌ని తెలిపింది. విధాన పరిషత్ స్థానం మాజీ సైనికులకు రిజర్వ్ చేస్తామ‌ని పేర్కొంది. 

పాఠశాలల కుక్‌ల వేతనాన్ని 5000లకు పెంచుతామ‌ని తెలిపింది. అనుభవం, నైపుణ్యాల ఆధారంగా తాత్కాలిక ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. గ్రామ ప్రధాన్ జీతం నెలకు రూ.6,000 పెంచుతామ‌ని తెలిపింది. ఆవు పేడను కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేసి స్వయం సహాయక సంఘాల ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేసేలా కృషి చేస్తామ‌ని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొంది. 

షెడ్యూల్డ్ కులాలు (st), షెడ్యూల్డ్ తెగల (sc)కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్ క‌ల్పిస్తామ‌ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కోల్ కమ్యూనిటీకి గిరిజన హోదా కల్పిస్తామ‌ని తెలిపింది. జర్నలిస్టులపై పెట్టిన కేసులు రద్దు చేసి అక్రమంగా జైల్లో ఉన్న వారిని విడుదల చేస్తామని చెప్పింది. హస్తకళాకారులు, చేనేత కార్మికులు, రైతులు, మాజీ సైనికులు వంటి సమూహాలకు ఐదు అదనపు స్థానాలు శాసన మండలిలో చేరుస్తామ‌ని పేర్కొంది.