కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భారత సైనికుల పరాక్రమాన్ని ప్రశ్నిస్తోందని అన్నారు.
Up election news 2022 : బీజీపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party), కాంగ్రెస్ (congress) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీలోని ఆగ్రా (agra)లో, మథుర (mathura)లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే రాజకీయాలు చేయకుండా సమాజ నిర్మాణం కోసం కూడా రాజకీయాలు చేయాలని సూచించారు. మతం, కుల రాజకీయాలు బీజేపీకి ఆమోదయోగ్యం కావని అన్నారు.
సైన్యం పరాక్రమంపై కాంగ్రెస్ ప్రశ్నలను లేవనెత్తిందని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. “రాహుల్ గాంధీ (rahul gandhi) గాల్వాన్ వ్యాలీలో చైనా-భారత్ ఘర్షణ గురించి మాట్లాడారు. ముగ్గురు చైనా జవాన్లు మాత్రమే చనిపోయారని ఆయన చదివారు. అదే నిజమని అతను నమ్ముతున్నాడు. అయితే నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఓ వార్త పత్రిక నివేదిక కనీసం 38-50 మంది చైనా జవాన్లు మృతి చెందారని పేర్కొంది. ఇద్దరు నుంచి నలుగురు కాదు. భారత సరిహద్దులు సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి ’’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. “ప్రపంచం ఇంతకుముందు మన సూచనలను తీవ్రంగా పరిగణించలేదు. కానీ నేడు భారతదేశం బలహీనంగా లేదు. మనం ఇప్పుడు ఏమి చెప్పినా ప్రపంచం మొత్తం వింటుంది. ఉరీ, పుల్వామా దాడుల తర్వాత మన సైన్యం పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులను ఎలా అంతమొందించిందో మీరు చూశారు. మేము బలమైన సందేశాన్ని ఇచ్చాం” అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
ఉత్తరప్రదేశ్ (Utharpradhesh) అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గతంలో రాష్ట్రంలో కేవలం రెండు నుంచి నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. అయితే మేము ఉత్తరప్రదేశ్ లోని ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని నిర్ణయించామని అన్నారు. ప్రస్తుతం వరకు 59 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఇందులో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయని. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
కోవిడ్-19 (covid -19) తో భారతదేశం వ్యవహరించిన తీరు అద్భుతమైనదని అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కోవిడ్ -19 ఇలా వ్యవహరించలేదని చెప్పారు. మరే ఇతర దేశం కూడా భారత్ వేసినన్ని టీకాలు ఇంత వేగంతో వారి పౌరులకు వేయలేదని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన మొదటి దశ ఎన్నికలు, ఫిబ్రవరి 14వ తేదీన రెండో దశ ఎన్నికలు, ఫిబ్రవరి 20వ తేదీన మూడో దశ ఎన్నికలు, ఫిబ్రవరి 23న నాలుగో దశ ఎన్నికలు, ఫిబ్రవరి 27న ఐదో దశ ఎన్నికలు, మార్చి 3వ తేదీన ఆరో దశ ఎన్నికలు, మార్చి 7వ తేదీన ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
