ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు (Uttar Pradesh Assembly election) షెడ్యూల్‌ వెలువడిన తర్వాత అక్కడి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య‌ (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు (Uttar Pradesh Assembly election) షెడ్యూల్‌ వెలువడిన తర్వాత అక్కడి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య‌ (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయన బాటలో మరికొందరు నడవడంతో.. బీజేపీ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటివరకు యోగి కేబినెట్‌‌లో ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన నేతలు అంతా చెబుతున్న కారణం ఒకే విధంగా ఉంది. 

యూపీలోని యోగీ ప్రభుత్వ హయాంలో దళితులు, వెనుకబడిన తరగతులు, నిరుద్యోగ యువకులు, రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు నిర్లక్ష్యానికి గురయ్యారనేది వారి ప్రధాన ఆరోపణ. మంత్రి పదవులకు రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ ఇద్దరు కూడా వారి రాజీనామా లేఖల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే పెద్ద మొత్తంలో బీజేపీ నేతలు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వారి రాజీనామాలు వెనక కారణాలు.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఒకసారి చూద్దాం. 

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై బ్రాహ్మణులలో ఆగ్రహం ఉండటం.. ఇప్పటికే అతిపెద్ద సవాలుగా మారింది. మరోవైపు ఓబీసీ వర్గానికి చెందిన కొందరు నేతలు కూడా యోగి సర్కార్‌లో తమకేమి పెద్దగా ప్రయోజనం చేకూరలేదని.. అంతా యోగి వర్గం హవానే కొనసాగిందని అభిప్రాయంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓబీసీల్లో ప్రముఖ నాయకులుగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. 

యూపీలో మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం యూపీలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అంటే ఇందుకోసం వెనక చాలా రోజులుగా తెర వెనక మంతనాలు సాగుతున్నాయనే మాట వినిపిస్తుంది. 

రాజీనామా చేసిన వారు.. 
1. రాధా కృష్ణ శర్మ, బదౌన్ జిల్లాలోని బిల్సీ నుండి ఎమ్మెల్యే.
2. రాకేష్ రాథోడ్, సీతాపూర్ ఎమ్మెల్యే.
3. బహ్రైచ్‌లోని నాన్‌పరా ఎమ్మెల్యే మాధురీ వర్మ.
4. జై చౌబే, సంత్ కబీర్‌నగర్ నుండి బిజెపి ఎమ్మెల్యే.
5. స్వామి ప్రసాద్ మౌర్య, కేబినెట్ మంత్రి
6. భగవతి సాగర్, ఎమ్మెల్యే, బిల్హౌర్ కాన్పూర్
7. బ్రిజేష్ ప్రజాపతి, ఎమ్మెల్యే
8. రోషన్ లాల్ వర్మ, ఎమ్మెల్యే
9. వినయ్ శాక్య, ఎమ్మెల్యే
10. అవతార్ సింగ్ భదానా, ఎమ్మెల్యే
11. దారా సింగ్ చౌహాన్, కేబినెట్ మంత్రి
12. ముఖేష్ వర్మ, ఎమ్మెల్యే
13. ధరమ్ సింగ్ సైనీ, కేబినెట్ మంత్రి
14. బాల ప్రసాద్ అవస్తి, ఎమ్మెల్యే

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో యూపీలో అధికారం చేపట్టింది. అందుకోసం అనేక వ్యుహాలను అమలు చేసింది. ముఖ్యంగా ఎస్పీ, బీఎస్పీ‌లను బలహీన పరిచేలా.. చాలా కాలంగా ఆ పార్టీలకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తవ వైపు తిప్పుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి యాదవ్‌లు కానీ ఇతర ఓబీసీ వర్గాల ఓట్లను, బీఎస్పీ నుంచి జాతవ్ తప్ప కానీ ఇతర దళిత వర్గాల ఓట్లను చీల్చడడంలో బీజేపీ విజయం సాధించింది. ఇందుకు బీజేపీకి చాలా ఏళ్లే పట్టిందని చెప్పాలి. అయితే ఈ ప్రయత్నాని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వేవ్ కూడా పనిచేసింది. ఇదే యూపీలో 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేక్కింజుకోవడానికి తోడ్పడింది.

ఉత్తరప్రదేశ్‌లో 35-37 శాతం మంది ఓబీసీ ఓటర్లు ఉన్నారు. ఓబీసీ కేటగిరిలో యాదవ్‌ ఓట్లదే డామినేషన్. 2014 తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖిలేష్‌కు అనుకూలంగా ఉన్న యాదవేతర ఓబీసీ ఓట్లను బీజేపీ పెద్ద సంఖ్యలో తనవైపుకు మళ్లించుకుంది. అఖిలేష్ యాదవ్‌కు పెద్ద సంఖ్యలో యాదవ్‌ల నుంచి మద్దతు లభించినప్పటికీ.. యాదవేతర ఓబీసీ ఓటర్ల నుంచి ఊహించని షాక్ తగిలింది. సేమ్ ఇదే రకమైన పరిణామం దళిత ఓటర్ల విషయంలో బీఎస్పీకి ఎదురైంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఎప్పటినుంచో బీజేపీ అనుకూలంగా ఉన్న అగ్రవర్ణాల ఓట్లతో పాటు.. యాదవేతర ఓబీసీ ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ యూపీలో అధికారం చెపట్టింది. 

అఖిలేష్ వ్యుహాం అదేనా..
గతంలో మద్దతుగా ఉండి బీజేపీ వైపు మళ్లిన ఓటర్లను తిరిగి తమ పార్టీ వైపు తీసుకొచ్చే విధంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా యోగి నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను కూడా తనవైపుకు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం యూపీలో మాయావతి బీఎస్పీ పరిస్థితి అంతంతా మాత్రంగానే ఉండటంతో.. దళిత వర్గాల ఓట్లపై కూడా అఖిలేష్ దృష్టి సారించారు. మరోవైపు యోగి సర్కార్‌పై ముస్లింల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వారిలో మెజారిటీ ఓటర్లు అఖిలేష్ వైపే చూసే అవకాశం ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. 

ఈ క్రమంలోనే యోగి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలతో అఖిలేష్ పార్టీ నాయకులు సంప్రందింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ముఖ్య నేతలను తమవైపు తిప్పుకుంటున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య విషయానికి వస్తే.. యూపీలోని ఓబీసీ నేతల్లో కీలకంగా ఉన్నారు. ఆయనకు యూపీ తూప్పు ప్రాంతంపై మంచి పట్టు ఉంది. అటువంటి నేతలను తనవైపుకు తిప్పుకోవడం ద్వారా అఖిలేష్.. ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా బీఎస్పీ, కాంగ్రెస్ మినహా ఇతర చిన్న పార్టీలతో కలిసి బీజపీకి వ్యతిరేకంగా పోరు సాగించేందుకు సిద్దమవుతున్నారు.