UP Election 2022: బీజేపీ ఇప్పటి వరకు నేర చరిత్ర కలిగిన 99 మంది అభ్యర్థులను బరిలోకి దింపిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.   

 UP Election 2022: యూపీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ర‌స‌వ‌ర‌త్తంగా మారుతున్నాయి. రోజురోజుకు ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఎస్‌పీ, బీఎస్‌పీ మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. ఈ త‌రుణంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీ అధిష్టానంపై విరుచుక‌ప‌డ్డారు. బీజేపీ నేతలు అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న విమర్శలను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అంతే ధీటుగా తిప్పికొట్టారు. 

నేరచరితులకు టిక్కెట్ల విషయంలో బీజేపీ సెంచరీకి చేరువలో ఉందని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన 99 మంది అభ్యర్థులను బరిలోకి దింపిందని సమాజ్‌వాదీ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘‘బీజేపీకి సెంచరీ కొట్టే అవకాశం తక్కువే. వారు 99 మంది నేరస్థులకు టిక్కెట్లు ఇచ్చారు' అని ఆదివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. నేరగాళ్ల విషయంలో ఎస్పీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం వేగంగా సాగుతోంది.


దీనికి ముందు.. అఖిలేష్ యాదవ్, అతని పార్టీ నేర నేపథ్యం ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తోందని బిజెపి ఆరోపిస్తుండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తూ అఖిలేష్ నిప్పులు చెరిగారు. ఎస్పీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నేరగాళ్ల రాజ్యమే వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌లు మార్లు ఆరోపించారు. 

 యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని నేరగాళ్లు జైళ్లకు వెళ్లడమో, సమాజ్‌వాదీ పార్టీలో ఉండటమో జరిగిందని వ్యాఖ్యానించారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ సైతం తాను మళ్లీ అధికారంలోకి వస్తే క్రిమినల్స్‌పై తన బుల్‌డోజర్ పాలసీని కొనసాగిస్తానని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7 వరకూ ఏడు విడతల్లో జరుగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.