ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకూ బాలికలు, మహిళలపై దాడుల సంఘటనలు ఎక్కువవుతున్నాయి. హత్రాస్ ఘటన తరువాత మరో యువతి మాయమై పంటపొలాల్లో శవమై తేలింది. తాజాగా పదిహేనేళ్ల మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే యూపీ, మీరట్ నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె బంధువులైన ఇద్దరు యువకులు ఇంట్లో నుండి ఎత్తుకెళ్లారు. ఆ తరువాత ఆమెకు మత్తుమందు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశారని ఏఎస్పీ సూరజ్ రాయ్ చెప్పారు. బాధిత బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఈ కేసులో నిందితులైన ఇద్దరు యువకులను అరెస్టు చేశామని ఏఎస్పీ సూరజ్ రాయ్ చెప్పారు. 

గత నెల సెప్టెంబర్ 6వ తేదీ నుండి కనిపించకుండా పోయిన ఓ యువతి పంటపొలాల్లో శవమై తేలింది. ఇద్దరు యువకులు ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసి వుంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఈ  దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత నెల 26వ తేదీన తమ కూతురు కనిపించక పోవడంతో ఓ వైపు వెతుకుతూనే పోలీసులకు కూడా పిర్యాదు చేసినట్లు మృతురాలి తండ్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని శనివారం సాయంత్రం పొలాల్లో గుర్తించిన కొందరు తమకు సమాచారమిచ్చారని అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన హత్రాస్ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు కలిసిన తర్వాత సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవలే మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

ఇక హత్రాస్‌ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. వీటిలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భీమ్‌ ఆర్మీ చీష్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాల్గొన్నారు. దోషులను ఉరితీయాలని. ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.