ఓ విద్యార్ధిని కాంగ్రెస్ విద్యార్ధి విభాగానికి చెందిన నాయకుడు బెదిరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు ఇర్ఫాన్ హుస్సేన్ జూనియర్ విద్యార్థినితో ఏదో విషయంలో గొడవ పడ్డాడు.

ఆగ్రహంతో ఊగిపోయిన ఇర్ఫాన్ సదరు బాలికతో ‘‘ అందంగా ఉన్నావ్.. కాస్తా హద్దుల్లో ఉంటే ఇంకా అందంగా ఉంటావ్.. నువ్వు ప్రస్తుతం ఫస్టియర్, మరో మూడేళ్లు ఇక్కడే ఇదే కాలేజీలో చదువుకోవాలని, నేను తలచుకుంటే నిన్ను కాలేజీలో అడుగుపెట్టకుండా చేయగలను జాగ్రత్త’’ అంటూ బెదిరించాడు.

అతను అలా అంటూ ఉంటే అడ్డుకోవాల్సిన అధ్యాపకులు, తోటి విద్యార్ధులు ఏమాత్రం అడ్డుకోలేదు.. మిగతా విద్యార్ధులు సైతం వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఈ తతంగం సోషల్ మీడియాలోకి ఎక్కడం అది కాస్తా వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇర్ఫాన్ హుస్సేన్‌ను అధ్యక్ష పదవిలోంచి తప్పించడమే కాకుండా ఎన్ఎస్‌యూఐ నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకూడదని ఆదేశించింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.