ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు 10వ తేదీ నుంచి జరగనున్నాయి. 58 అసెంబ్లీ స్థానాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ట్విట్టర్‌లో కీలక పోస్టు పెట్టారు. ప్రధాని మోడీ, తాను చేతులు పైకెత్తి విజయగర్వాన్ని చూపుతున్నట్టుగా ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(UP Elections 2022) తొలి విడత ఎన్నికలు(First Phase) గురువారం జరగనున్నాయి. సరిగ్గా ఒక్క రోజు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) ట్విట్టర్‌లో కీలక పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇరువురూ విజయగర్వంతో ఉన్నట్టుగా కనిపిస్తున్న చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఆ ఫొటోతో పాటు ఒక కవితాత్మకమైన కొటేషన్ పెట్టారు.
పీడితులు, శోషితులు, దుఖితులు, వంచితుల బాంధువులమై.. వారి కష్టాలను తొలగించాల్సి ఉన్నదని, దేశ ధర్మాన్ని అమలు చేయడానికి చాతి నిబ్బరం చేసి ఉన్నామని ట్వీట్ చేశారు. నిరంతరం పాదాలు ఆడుతూ ఉండే వారి శ్రమ అవిరామమైనదని పేర్కొన్నారు. ఇలాంటి వారికి విజయం సునిశ్చితమని చరిత్ర ఇది వరకే వెల్లడించి ఉన్నదని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం యోగి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది. యోగి ఆదిత్యానాథ్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత ఎన్నికల్లో 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ తొలి విడత ఎన్నికలు షామ్లీ, హాపూర్, గౌతమ్ బుద్ధ నగర్, ముజఫర్‌నగర్, మీరట్, బాఘ్‌పాట్, ఘజియాబాద్, బులంద్‌షహర్, అలీగడ్, మాథుర, ఆగ్రాల్లో రేపు ఉదయం ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుఉన్నాయి.
ఇదిలా ఉండగా, అఖిలేశ్ యాదవ్ సారథ్యంతోని సమాజ్‌వాదీ పార్టీతో జట్టు కట్టిన సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సంచలన హామీలు ఇచ్చారు. 70 సీట్లతో నడిచే ట్రైన్ (Train)లో 300 మంది ప్రయాణించడానికైనా అనుమతిస్తారని, కానీ, ఒక బైక్‌పై ముగ్గురినిఎందుకు ప్రయాణించడానికి అనుమతించరని ప్రశ్నించారు.
‘ఒక ట్రైన్ 70 సీట్లపై 300 మంది ప్రయాణికులను మోసుకెళ్తుంది. అలాంటప్పుడు ఒక బైక్‌పై ముగ్గురు వెళ్తే సమస్య ఏంటి?’ అని ఓం ప్రకాశ్ రాజ్‌భర ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతి ఇస్తామని వివరించారు. లేదంటే సీట్ల కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లే.. ట్రైన్లు, జీపులకూ చలాన్లు వేస్తామని పేర్కొన్నారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఘాజీపూర్ జిల్లాలోని జహూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 7వ తేదీన ఘాజీపూర్‌లో ఎన్నికలు జరుగుతాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ పార్టీపై సమాజ్‌వాదీ పార్టీ బలంగా పోరాడుతున్నది. అఖిలేశ్ యాదవ్ ప్రతిపక్ష శిబిరంలోని ఇతర నేతలనూ సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్, మమతా బెనర్జీల నుంచీ ఆయనకు మద్దతు ఉన్నది. ఈ మద్దతు ఓట్లు కురిపిస్తాయా? అనేది తేలాల్సి ఉన్నది. అదీగాక, అఖిలేశ్ యాదవ్ స్థానికంగా ఉన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.
