Asianet News TeluguAsianet News Telugu

up assembly election 2022 : గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ

గోర‌ఖ్ పూర్ నుంచి సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అజాద్ సమాజ్ పార్టీ నేడు అధికారికంగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో చంద్రశేఖర్ ఆజాద్ గోరఖ్ పూర్ నుంచి పోటీ చేస్తారని పేర్కొంది. 

up assembly election 2022: Bhim Army Chief Chandrasekhar Azad contests against Yogi Adityanath in Gorakhpur
Author
Lucknow, First Published Jan 20, 2022, 2:27 PM IST

యూపీ (up) శాస‌న‌స‌భ‌కు తొలిసారిగా గోర‌ఖ్ పూర్ నుంచి సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ (cm yogi adhithyanath) పోటీచేయ‌నున్నారు. అయితే ఆయ‌న‌పై అదే స్థానం నుంచి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (chandrashekar azad) పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో అక్క‌డ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. 

భీమ్ ఆర్మీ చీఫ్ అయిన చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ పోయిన వారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. దీంతో స‌మాజ్ వాదీ పార్టీ, ఆజాద్ స‌మాజ్ పార్టీలు క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ  చేయ‌నున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే రెండు పార్టీల మ‌ధ్య పొత్తుకు అవ‌కాశ‌మే లేద‌ని ఆజాద్ దానిని తోసిపుచ్చారు. అయితే నేడు ఆజాద్ స‌మాజ్ పార్టీ అధికారికంగా విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల లిస్ట్ లో గోర‌ఖ్ పూర్ నుంచి చంద్ర‌శేఖ‌ర్ పోటీలో ఉంటార‌ని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు చర్చలు విఫలమవడంతో ఆజాద్ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో దాదాపు 33 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది.

గోరఖ్‌పూర్ (ghorakhpur) ప్రాంతం ప్ర‌స్తుత సీఎం, బీజేపీ నాయ‌కుడు యోగి ఆదిత్యనాథ్‌కు రాజ‌కీయంగా కంచుకోట. ఆయ‌న 1998 నుంచి గోర‌ఖ్ పూర్ లోక్ స‌భ స్థానం నుంచి గెలుపొందుతూ వ‌స్తున్నారు. 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న ఎంపీగా గెలుపొందారు. అయితే అత‌డిని బీజేపీ అధిష్టానం సీఎంగా ప్ర‌క‌టించింది. దీంతో అత‌డు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. సీఎం కుర్చీ ఎక్కిన త‌రువాత ఆయ‌న శాస‌నమండ‌లి స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. అయితే ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల్లో మొద‌టి సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. 

బీజేపీ జనవరి 15వ తేదీన యూపీ ఎన్నికల కోసం 107 మంది అభ్యర్థులతో తన మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ కాషాయ పార్టీ గోరఖ్‌పూర్ (అర్బన్) అసెంబ్లీ నియోజకవర్గం నుండి యోగి ఆదిత్యనాథ్‌ను, ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను పోటీకి దింపింది. 

మొదటి సారి  యోగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకొని, అధికారిక ప్రకటన వెలువడిన తరువాత డిప్యూటీ సీఎం మౌర్య.. అఖిలేష్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి స‌మాజ్ వాదీ పార్టీ అధినేత భ‌య‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ‘‘అఖిలేష్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయం.. పోటీ చేసే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి చాలా సమయం పట్టింది. మేము అభివృద్ధి చేసిన పార్టీ నుంచి పోటీ చేయాలంటే ఆయ‌న భ‌య‌పడ్డారు. అఖిలేష్ జీ.. 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఏ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందిందో చెప్పండి. మీరు అభివృద్ధి చేయ‌లేరు. బీజేపీ చేసిన అభివృద్ధి ప్రాంతంలో పోటీ చేయండి’’ అంటూ మౌర్య హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ జనవరి బుధవారం నాడు బీజేపీలో చేరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios