ఇజ్రాయెల్‌కు చెందిన ఐఎస్ఎంసీ అనలాగ్ ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
రూ.22,900 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను (Semiconductor Fabrication) ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు (Israel) చెందిన ఐఎస్ఎంసీ అనలాగ్ ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (ISMC Analog Fab Private Limited) కర్ణాటక ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీ మధ్య ఎంవోయూ కుదిరింది.
దీని కారణంగా రాబోయే ఏడు సంవత్సరాలలో 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కర్ణాటక ప్రభుత్వం తరపున ఐటీ శాఖ కార్యదర్శి డాక్టర్ ఈవీ రమణారెడ్డి, ఐఎస్ఎంసీ డైరెక్టర్ అజయ్ జలన్ ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) మాట్లాడుతూ.. ఐటీ, బీటీ, ఆర్ అండ్ డీ రంగాలలో కర్ణాటక ఇప్పటికే అగ్రగామిగా వుంది. ఐఎస్ఎంసీతో ఎంవోయూ కుదుర్చుకోవడం వల్ల సెమీ కండక్టర్ టెక్నాలజీలోనూ కర్ణాటక తన సత్తాను చూపే అవకాశం దొరుకుతుందని సీఎం అన్నారు.
సెమీకండక్టర్ ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులను అందుకునేందుకు అనేక రాష్ట్రాలు పోటీపడుతున్న తరుణంలో కర్ణాటక అవకాశాన్ని అందుకుందని బొమ్మై చెప్పారు. రాయితీలు, ప్రోత్సాహకాలు మాత్రమే కాదని.. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనుకూలమైన వాతావరణం అవసరమని బసవరాజ్ బొమ్మై తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను కలిగి వుందని ఆయన చెప్పారు.
కాగా.. కేవలం కర్ణాటకలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా , ఇక్కడ ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్నందున సాంకేతికతను తీసుకురావాలని ఐఎస్ఎంసీని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్య, ఐటీ, బీటీ సీఎస్ అశ్వత్నారయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఐఎస్ఎంసీ ఎంవోయూ కుదుర్చుకోవడంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) అభినందనలు తెలిపారు. . ఇటువంటి ఫ్యాబ్ రాబోయే రెండు దశాబ్ధాల పాటు స్టార్టప్‌లలో యువతకు అవకాశాలు మరింత అందుతాయని ఆయన ఆకాంక్షించారు.
