Asianet News TeluguAsianet News Telugu

ఆర్ధిక వ్యవస్ధకు చేయూత: కొత్తగా ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్‌ యోజన

‘ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0’లో భాగంగా 12 కీలక ప్రకటనలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ తీసుకొచ్చినట్లు తెలిపారు.  

union minister Nirmala Sitharaman announces 12 schemes to boost economy
Author
New Delhi, First Published Nov 12, 2020, 3:52 PM IST

కొవిడ్‌ సంక్షోభంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపనతో ముందుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇప్పటివరకు మూడు ఉద్దీపన పథకాలు ప్రకటించి, అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం గురువారం నాలుగో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది.

‘ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0’లో భాగంగా 12 కీలక ప్రకటనలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ తీసుకొచ్చినట్లు తెలిపారు.  

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు కల్పించిందని ఆమె పేర్కొన్నారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద కొత్త ఉద్యోగులను తీసుకునే సంస్థలకు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌లో రెండేళ్ల పాటు సబ్సిడీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

అక్టోబరు 1 నుంచి ఈ రాయితీ వర్తిస్తుందని ఆమె ప్రకటించారు. 1000లోపు ఉద్యోగులుండే సంస్థలకు ఉద్యోగుల వాటా, సంస్థల వాటా పీఎఫ్‌ మొత్తం 24శాతం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 1000 కంటే ఎక్కువ ఉండే సంస్థలకు మాత్రం ఉద్యోగుల పీఎఫ్‌ వాటాను కేంద్రం ఇస్తుందని నిర్మల తెలిపారు.   

ఈ సందర్భంగా రూ. 3లక్షల కోట్లతో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్నివచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

గతంలో కేవలం సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ పథకాన్ని అమలు చేయగా.. తాజాగా బిజినెస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ముద్రా రుణాలు, వ్యాపార రుణాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు.

కొవిడ్‌ కారణంగా కుదేలైన రంగాలకు రుణ గ్యారెంటీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కామత్‌ కమిటీ సూచించిన 26 ఒత్తిడికి గురైన రంగాలకు రుణ భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.    
 

Follow Us:
Download App:
  • android
  • ios