ఈ నెల 26న న్యూఢిల్లీలో జీ20 యూనివర్శిటీ కనెక్ట్ : వీసీలు, విద్యార్థులతో మోడీ భేటీ
ఈ నెల 26న న్యూఢిల్లీలో జీ20 యూనివర్శిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులతో మోడీ భేటీ కానున్నారు.

న్యూఢిల్లీ:ఈ నెల 26న న్యూఢిల్లీలో యూజీసీ జీ-20 యూనివర్శిటీ కనెక్ట్ ముగింపుఈవెంట్ ను నిర్వహిస్తుంది. ఇటీవల న్యూఢిల్లీలోని జీ-20 సమావేశాలు నిర్వహించిన భారత మండంపలోనే ఈ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి యూనివర్శిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లను ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.గత ఏడాదిలో జీ-20 యూనివర్శిటీ కార్యక్రమం ద్వారా దేశంలోని యువశక్తి ఒక చోటకు చేర్చిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా లింక్‌డిన్ లో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఏడాది పొడవునా జరిగిన కార్యక్రమాలు సంతృప్తికరమైన ఫలితాలను అందించినట్టుగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత్ కు చెందిన యువత శక్తివంతమైన దూతలుగా ఎలా ఉద్భవించారో ప్రపంచానికి చూపిందని మోడీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా జీ-20 యూనివర్శిటీ కనెక్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పలు విద్యాసంస్థల విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యారు. తొలుత దీన్ని విశ్వవిద్యాలయాల్లోనే ప్రారంభించారు. కానీ ఆ తర్వాత స్కూల్స్, కాలేజీల్లో కూడ నిర్వహించారు.
ఈ సమావేశంలో జీ 20 దేశాలకు చెందిన 10 దేశాలకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు కూడ పాల్గొంటారు. పర్యావరణం కోసం జీవన శైలి అనే అంశంపై చర్చించనున్నారని మోడీ వివరించారు.
జీ-20 యూనివర్శిటీ ప్రోగ్రామ్ సందర్భంగా తమ యువశక్తి అనుభవాలను వినడానికి తాను ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశంలోని యువతలో స్పూర్తిని నింపేలా చేస్తున్న ప్రయత్నంలో యువత పాల్గొనాలని మోడీ కోరారు.ఆర్ఐఎస్ నేతృత్వంలోని జీ20 యూనివర్శిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ భారత్ గొప్ప విజయాన్ని సాధించిందని యూజీసీ తెలిపింది.
ఈ సమావేశాలు విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22న పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను భారత మండపంలో మోడీ అభినందించారు.