తాము మహారాష్ట్రలోని వికాస్ అఘాదిలో చేరుతామని, ఆ పార్టీలతో జట్టు కడతామని శివసేనకు ఏఐఎంఐఎం ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ తిరస్కరించడమే కాదు.. అది బీజేపీ కుట్ర అని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
ముంబై: ఏఐఎంఐఎం పార్టీ బీజేపీకి బీ టీమ్ అని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రె ఆరోపణలు చేశారు. ఆ పార్టీతో ఎలాంటి పొత్తులూ ఉండబోవని స్పష్టం చేశారు. ఈ డ్రామా అంతా కేవలం శివసేనపై తప్పుడు అభిప్రాయాలు కల్పించడానికే అని తెలిపారు. శివసేన ప్రతిష్టతను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ప్రతిపక్షాలు ఈ కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. శివసేన సారథ్యంలోని మహావికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని, అలాగే, శివసేన హిందూత్వపై తప్పుదారి పట్టించే లక్ష్యంతో ఈ ప్రయత్నాలకు పూనుకుంటున్నాయని విమర్శించారు.
శివసేన పార్టీని జనాబ్ సేన అని పేర్కొనడాన్ని ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేరుకు ఖాన్ లేదా జనాబ్ అని జోడించాలని సీరియస్ అయ్యారు. ముస్లింలపై ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఉన్న ప్రేమను బయటపెట్టాలని శివసైనికులను ఆయన కోరారు. బీజేపీ హిందూత్వ ఒక బూటకం అని ప్రజలకు అర్థం అయ్యేలా విడమర్చి చెప్పాలని తెలిపారు.
బీజేపీ హయాంలో పాకిస్తాన్ అనుకూల నిర్ణయాలు ఎన్ని జరిగాయో బయటపెట్టాలని అన్నారు. అసలు ఆ పార్టీని పాకిస్తాన్ జనతా పార్టీ అని పిలవాలా? లేక హిజ్బుల్ జనతా పార్టీ అని అనాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో వారు ఇస్లాం ప్రమాదంలో ఉన్నదని వాదించేవారని, ఇప్పుడు హిందూ మతం ఆ ముప్పులో ఉన్నదని భయాలను వ్యాపించడానికి అంటున్నారని ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు. అదే సమయంలో శివసేనను జనాబ్ సేనా అని ఎగతాళి చేసే పనిలో ఉన్నారని అన్నారు. తాము హిందూత్వను వదులుకోలేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు ఆడుతున్న గేమ్‌లో భాగంగానే ఏ కారణం లేకుండానే మహావికాస్ అఘాదిలో చేరుతామని ఎంఐఎం ఆఫర్ చేసిందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఇక్కడే అసలైన ట్రిక్కు దాగి ఉన్నదని, ఇలా ఆఫర్ చేసి తమ పార్టీపై వరుసగా విమర్శలు చేయాలని బీజేపీ చూస్తున్నదని పేర్కొన్నారు. తాము బీజేపీ తరహాలనే అధికారం కోసం అడ్డమైన గడ్డి తినేవారం కాదని వివరించారు. ఎంఐఎంతో కలిసి పోతామనే ఆలోచన చేయడమూ కష్టమేనని తెలిపారు.
దేవేంద్ర ఫడ్నవీస్‌పై పరోక్ష విమర్శలు చేస్తూ బీజేపీ నేతలు ఓ కేసులో తమ వాంగ్మూలాలు పోలీసులకు ఇస్తూ కూడా ప్రజాస్వామ్య ఖూనీ అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. 12 మంది ఎమ్మెల్సీ నామినేషన్లను పెంచింగ్‌లో పెట్టిన గవర్నర్ బీఎస్ కొశ్యారీపై విమర్శలు చేశారు. క్యాబినేట్ ఆమోదించి పంపిన 12 మంది ఎమ్మెల్సీ నామినేషన్లపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ప్రజాస్వామ్య ఖూనీ కాదా? అంటూ సీఎం పేర్కొన్నారు.ఆశిస్తున్నారని ప్రశ్నించారు.
