మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు.. సంజయ్ రౌత్ పార్ట్‌నర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిందని ఓ బీజేపీ సీనియర్ నేత ఆరోపణలు చేశారు. సహ్యాద్రి రిఫ్రెష్‌మెంట్స్ నడుపుతున్న రాజీవ్ సాలుంకేకు ఠాక్రే ప్రభుత్వం రూ. 100 కోట్ల విలువ చేసే కొవిడ్ సెంటర్ల కాంట్రాక్టు ఇచ్చినట్టు ఆయన ట్వీట్ చేశారు. సంజయ్ రౌత్‌కు పార్ట్‌నర్‌గా ఉండే సుజీత్ పాట్కర్‌కు చెందిన బ్లాక్ లిస్టెడ్ కంపెనీలో రాజీవ్ సాలుంకే ప్రధాన భాగస్వామిగా ఉండటం గమనార్హం.
ముంబయి: బీజేపీ(BJP) మాజీ ఎంపీ కిరిత్ సోమయ (Kirit Somaiya) మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక చాయ్ దుకాణదారుడికి రూ. 100 కోట్ల కోవిడ్ సెంటర్ కాంట్రాక్టు(Contract)ను ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. దుకాణదారుడికి కోవిడ్ సెంటర్ కాంట్రాక్ట్ రావడం ఏమిటనే అనుమానాలు సహజంగానే రావొచ్చు. అంతకు మించి సందేహాలు వచ్చే మరో విషయం.. ఆ దుకాణదారుడు శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ పార్ట్‌నర్. ఆ ‘అవినీతి’కి సంబంధించిన డాక్యుమెంట్లను బీజేపీ సీనియర్ నేత కిరిత్ సోమయ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతున్నది. ఆ ట్వీట్‌పై రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. సహ్యాద్రి రిఫ్రెష్‌మెంట్స్ అనే కేఫ్ యజమాని రాజీవ్ సాలుంకేకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రూ. 100 కోట్ల కొవిడ్ సెంటర్ కాంట్రాక్టు ఇచ్చింది. సంజయ్ రౌత్ పార్ట్‌నర్ సుజీత్ పాట్కర్‌కు చెందిన లైఫ్ లైన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో సాలుకేం ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పుడు లైఫ్ లైన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ బ్లాక్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను బీజేపీ మాజీ ఎంపీ కిరిత్ సోమయ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన పోస్టుతోపాటు కొన్ని డాక్యుమెంట్లనూ జత చేశారు.
ఇలా.. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాదీ సారథ్యంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను బట్టబయలు చేయాలని, వాటిని బయటపెట్టి ఆ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని కొందరు యూజర్లు ఆయనకు దన్నుగా నిలిచారు.
గత శనివారం కిరిత్ సోమయపై పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోనే దాడి జరిగిన సంగతి తెలిసిందే. కొందరు శివసేన కార్యకర్తలు ఆయనపై దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు. కొవిడ్ సెంటర్‌లకు చెందిన రూ. 100 కోట్ల కాంట్రాక్టు అవినీతిని తాను బట్టబయలు చేస్తున్నారని, అందుకే వారికి కంటగింపుగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంగణంలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని, తద్వారా కొందరు శివసేన నేతలు తనను నేరుగా తాకగలిగారని తెలిపారు. తనను చంపేయడానికి కొందరు ప్రయత్నించారని, ఈ మేరకు పోలీసులు కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దాడి అనంతరం బీజేపీ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసింది. బీజేపీ మాజీ ఎంపీ కిరిత్ సోమయపై దాడిని తీవ్రంగా పరిగణించాలని, దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పూణె మున్సిపల్ కార్పొరేషణ్ ఆవరణలో భద్రతా కట్టుదిట్టంగా లేదని ఆరోపించారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
