Asianet News TeluguAsianet News Telugu

సావర్కర్‌ను అవమానించడం ద్వారా రాహుల్ సత్యయుద్ధంలో గెలవలేరు: సామ్నా సంపాదకీయం

స్వాతంత్ర సమరయోధుడు వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని శివసేన తప్పుపట్టింది. మహా వికాస్ అఘాడిలో భాగమైనప్పటికీ, శివసేన (UBT) సావర్కర్‌ సిద్దాంతాలకు కట్టుబడి ఉందని మరోసారి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. 

Uddhav Sena editorial says Rahul Gandhi can't win battle of truth by insulting Savarkar:
Author
First Published Mar 28, 2023, 8:00 AM IST

స్వాతంత్ర సమరయోధుడు వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ -ఎన్సీపీ-శివసేన (ఠాక్రే) పార్టీలతో కూడిన ఈ కూటమి  అధికారం కోల్పోయినప్పటికీ జట్టుగానే ఉంది. అయితే, తాజాగా సావర్కర్‌పై రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వారి మధ్య చిచ్చు పెడుతున్నాయనే చెప్పాలి.  రాహుల్‌ వ్యాఖ్యలపై శివసేన (ఠాక్రే) అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా.. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి గైర్హారయ్యారు.  

ఈ నేపథ్యంలో అనర్హత వేటు పడిన ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన తన మౌత్‌పీస్ - సామ్నా - తన సంపాదకీయంలో విరుచుకుపడింది. సావర్కర్ కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, సావర్కర్‌ తమ దేవుడని, ఆయనను అవమానిస్తే సహించబోమని , సావర్కర్‌ను తక్కువ చేసినంత మాత్రాన ధైర్యవంతులు అయిపోరని శివసేన (ఠాక్రే) పత్రిక సామ్నా సంపాదకీయంలో చురకేసింది. 

“పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జరిగింది అన్యాయం, కానీ సావర్కర్‌ను అవమానించడం ద్వారా అతను సత్య యుద్ధంలో గెలవలేడు.   సావర్కర్ తన 12వ ఏట నుంచే పోరాటం చేశారని, ఆయన గాంధీజీ అనుసరించారని వివరించింది. లోక్‌ సభ సభ్యుడిగా అనర్హత వేటు పడి  సానుభూతి పొందుతున్నారనీ, సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ సానుభూతిని చెడగొట్టుకోవద్దని రాహుల్‌కు సూచించింది.

ఇటువంటి ప్రకటనలు మహారాష్ట్రలో పార్టీకి మాత్రమే కాదు.. కూటమిలో కూడా సమస్యలు వస్తాయని కాంగ్రెస్ , రాహుల్ గాంధీలను హెచ్చరించింది. వీర్ సావర్కర్ గొప్పవాడు. కారణం లేకుండా సావర్కర్‌ను పరువు తీయడం ద్వారా పోరాడే శక్తి ఎవరికీ రాదు. 'వీర్ సావర్కర్' పేరులోనే తేజస్సు ఉంది. అన్యాయం, బానిసత్వంపై  ఆయన కూడా పోరాడారు. వీర్ సావర్కర్ ఇంగ్లండ్‌లో, తన దేశంలో బ్రిటిష్ పాలనను పారద్రోలేందుకు యోధులను సృష్టించారు, ఆ యోధులు నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని శిక్షించడం అన్యాయమని, అయినా.. వీర్ సావర్కర్ పరువు తీయడం ద్వారా రాహుల్ పోరాటం చేస్తుంటే.. ఆ పోరాటం విజయం సాధించదని హెచ్చరించింది.

'నా పేరు సావర్కర్ కాదు' అని రాహుల్ గాంధీ పదేపదే ప్రకటనలు ఇస్తున్నారు. కానీ అలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది? సావర్కర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం పోదని సంపాదకీయం పేర్కొంది. మహా వికాస్ అఘాడి (MVA)లో శివసేన (UBT) భాగమైనప్పటికీ..సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, తాము సావర్కర్ సిద్దాంతాలకు  కట్టుబడి ఉన్నామని ఉద్ధవ్ థాకరే నుండి ఈ కథనం స్పష్టమైన సూచనగా కనిపిస్తోంది. శివ సేన (UBT)MVA కూటమిలో చేరకముందు కూడా సావర్కర్‌ను విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా నిలబడి, దేశం కోసం సావర్కర్ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios