ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో (Bijapur district) ఆదివారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్ మృతిచెందారని పోలీసులు తెలిపారు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో (Bijapur district) ఆదివారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్ మృతిచెందారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జబేలి గ్రామంలోని జంగిల్స్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఉదయం 6 గంటల సమయంలో భద్రతా బలగాల సంయుక్త బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టిన సమయంలో కాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి 9 ఎంఎం పిస్టల్‌తో పాటుగా రెండు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు.

‘జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్త బృందం శనివారం రాత్రి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. పక్కా సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబేలి, దుర్ధా మరియు మోస్లా గ్రామాల వైపు భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిని అనుమానిస్తూ భద్రతా బలగాలు కొండను చుట్టుముట్టాయి. ఆ సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది’ సుందర్‌రాజ్ తెలిపారు. 

ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో రెండు మహిళ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. ఇంకా ఆ ప్రాంతంలో 12 బోర్ గన్, 9 ఎంఎం పిస్టల్, కార్డెక్స్ వైర్, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు సంబంధించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించామని.. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. మృతిచెందినవారిని గుర్తించాల్సి ఉందని చెప్పారు.