హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల నుండి   ఇద్దరు సీనియర్ ఐటీ అధికారులను  ముందుగానే ఉద్యోగ విరమణ చేయించారు. అవినీతి ఆరోపణల కారణంగానే  వీరిద్దరిని ఉద్యోగ విరమణ చేయించాల్సి వచ్చిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.15 మంది ఆదాయపు పన్ను శాఖాధికారుల్లో  ఇద్దరు అవినీతి ఆరోపణలతో ఉద్యోగాల నుండి తప్పుకొన్నారు.

ఈ ఇద్దరిలో  జయప్రకాష్ ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకొంటున్నారనే ఆరోపణలపై సోదాలు నిర్వహించిన సమయంలో సీబీఐ అతని నుండి రూ. 24.60 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.

ఏపీకి చెందిన అడిషనల్ కమిషనర్ అప్పలరాజుపై కూడ ఆదాయ పన్ను శాఖ  చర్యలు తీసుకొంది.ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారని  అప్పలరాజుపై సీబీఐ ఆరోపణలు నమోదు చేసింది. అప్పలరాజు నుండి సీబీఐ  రూ. 60 లక్షలను స్వాధీనం చేసుకొంది.

అవినీతి ఆరోపణలతో పాటు సీబీఐ కేసులు ఇతరత్రా కారణాలతో   ప్రిన్సిపల్ కమిషనర్ తో పాటు 15 మంది సీనియర్ అధికారులను  కూడ  ఉద్యోగ విరమణ చేయాలని సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఈ నెల 27వ తేదీన సీబీడీటీ ఉత్తర్వులు జారీ చేసింది.