దేశరాజధాని ఢిల్లీ మెట్రోలోని ఎరుపు లైన్లో ఉన్న రెండు మెట్రో స్టేషన్ల పేర్లు మార్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇద్దరు అమర జవాన్ల పేరు వాటికి నామకరణం చేశారు.  ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది.

ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ కు సమీపంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ని  ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేషన్ల పేరు మార్పు విషయాన్ని డీఎమ్ఆర్‌సీ ప్రకటించింది.
 
రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్ పేరును మేజర్ మోహిత్ శర్మ రాజేంద్ర నగర్ స్టేషన్‌గా, న్యూ బస్ అడ్డా స్టేషన్‌ పేరును షహీద్ స్థల్ (న్యూ బస్ అడ్డా)గా పేర్లు మార్చారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంతాపంగా ఈ పేర్లు పెట్టినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
 
జెండా ఊపిన అనంతరం ప్రధాని మోదీ మొదటి ప్రయాణం చేశారు. ఘజియాబాద్‌లోని షహీద్ స్థల్ నుంచి కశ్మీరి గేట్ వరకు ప్రయాణించారు. ప్రస్తుతం ప్రారంభించిన వాటితో కలిసి 244 స్టేషన్లు, 336.6 కిలోమీటర్ల ట్రాక్ కలిగిన మెట్రోగా ఢిల్లీ మెట్రో ఘనత సాధించింది.

ఇటీవల పుల్వామాలో పాకిస్థాన్ ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో 40మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనికి భారత ఆర్మీ ప్రతీకారం కూడా తీర్చుకుంది.