భారత్ తో మామూలుగా వుండదు ... ఏకంగా విమానాలే ఎగుమతి చేసేసిందిగా...!
అదీ ఇదని కాదు... అన్ని రంగాల్లో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా విమానయాన రంగంలో ఇండియా మరో మైలురాయిని సాధించింది.
బెంగళూరు : భారత్ విమానయాన రంగంలో ఎంతటి అభివృద్ది సాధించిందో తాజా ఘటనతో బయటపడింది. ఇతర దేశాల నుండి రక్షణా, వాయుసేన సామాగ్రిని దిగుమతి చేసుకునే స్థాయినుండి ఇతదేశాలకు విమానాలను అందించే స్థాయికి భారత్ చేరుకుంది. తాజాగా హిందుస్ధాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ దేశీయ సాంకేతికతతో తయారుచేసిన రెండు విమానాలను గయానాకు అందించి చరిత్ర సృష్టించింది.
భారత్ శాస్త్రసాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. దీంతో మన దేశంనుండి ఈ రంగాలకు చెందిన వస్తువుల ఎగుమతి పెరిగింది. ఇలా మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం గయానా ప్రభుత్వం భారత్ నుండి రెండు విమానాలను కొనుగోలు చేసింది. ప్రకృత్తి విపత్తులు, మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఈ విమానాలను గయానా ఉపయోగించుకోనుంది.
విమానాలను గయానా ప్రభుత్వానికి అందించడానికి వెళ్లిన భారత వాయుసేన సిబ్బందికి అక్కడి హైకమీషన్ స్వాగతం పలికింది. హెచ్ఎఎల్-228 విమానాల ఒప్పందం ద్వారా ఇరుదేశాల దైపాక్షిక సంబంధాలు మరోస్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. విమానాలను అనుకున్న సమయానికి సరఫరా చేయడంద్వారా భారత విమానయానం,శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ది ప్రపంచానికి తెలిసిందన్నారు.
అసలు ఏమిటీ HAL?
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) భారత ప్రభుత్వానికి చెందిన విమానయాన మరియు రక్షణ రంగానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ భారత రక్షణ రంగం మరియు వ్యాపారానికి ఉపయోగించే విమానాలు, హెలికాప్టర్లు మరియు ఏవియేషన్, కమ్యూనికేషన్ పరికరాలను అభివృద్ది చేస్తుంది. ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుని ఏవియేషన్, కమ్యూనికేషన్ పరంగా సహాయసహాకారాలు అందిస్తుంటుంది. ఇలా తాజాగా గయానాకు విమానాల సరఫరా చేపట్టింది.