సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ పై ఆంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 మధ్య సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌కు షిరిడీ ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ షిరిడీ సబ్ డివిజనల్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. ఆమె ఆలయంలోకి ప్రవేశిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, కాదని ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంటామని నోటీసులో సబ్ డివిజనల్ ఆఫీస్ స్పష్టం చేసింది.

 షిరిడీ సాయిబాబా ఆలయం ముందు అంటించిన పోస్టర్లలోని అంశంపై తృప్తి దేశాయ్ ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. షిరిడీ ఆలయంలోకి, ఆలయ ప్రాంగణంలోకి భక్తులు భారతీయతకు అద్దం పట్టే సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని, నాగరిక వేషధారణలోనే రావాలన్నది పోస్టర్లలో ఉన్న సారాంశం. 

ఈ నిబంధనలను తృప్తి దేశాయ్ తప్పుబట్టారు. ఆ పోస్టర్లను తొలగించకపోతే తానూ, తనతో పాటు ఇతర సామాజిక కార్యకర్తలు కలిసి డిసెంబర్ 10, మధ్యాహ్నం 1 గంటకు ఆలయం వద్దకు వచ్చి తామే తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. దీంతో.. తాజాగా సబ్ డివిజనల్ ఆఫీస్ తృప్తి దేశాయ్‌కు నోటీసులు పంపింది.