Today’s News Roundup 28 th August 2025: ఇవ్వాళ్టి వార్తల్లోని ప్రధానాంశాలు: షారుఖ్ ఖాన్, దీపికాపై 420 కేసు!, తెలంగాణకు రూ.5,012 కోట్ల రైల్వే ప్రాజెక్ట్, కామన్వెల్త్ గేమ్స్ 2030 బిడ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, గ్రీన్‌లాండ్‌పై అమెరికా రహస్య ఆపరేషన్లు!
Today’s News Roundup 28 th August 2025: ఇవ్వాళ్టి వార్తల్లోని ప్రధానాంశాలు:
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, దీపికాపై 420 కేసు!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ప్రముఖ నటి దీపికా పదుకొనెపై రాజస్థాన్ పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు పఠాన్ సినిమాలో పనిచేసిన మరో ఆరుగురిపైనా కేసు నమోదైంది. హ్యుండాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న షారుఖ్, దీపికాతో కలిసి పఠాన్ సినిమా సమయంలో ఒక ప్రత్యేక మోడల్ కారును ప్రమోట్ చేశారు. ఈ ప్రమోషన్ వీడియో చూసి రాజస్థాన్‌కు చెందిన కీర్తి సింగ్ ఆ కారు కొనుగోలు చేశారని తెలిపారు.
అయితే కొనుగోలు చేసిన ఆరు నెలల్లోనే కారులో తీవ్ర తయారీ లోపాలు బయటపడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, “లోపభూయిష్టమైన కారును తప్పుడు ప్రచారంతో విక్రయించారు” అంటూ కోర్టులో కేసు వేశారు. కోర్టు విచారణ అనంతరం, ప్రమోషన్‌లో భాగమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, అలాగే మరో ఆరుగురిపై 420 కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్-వాడి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.5,012 కోట్ల రైల్వే ప్రాజెక్ట్‌కు ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం రూ.12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానమైనది సికింద్రాబాద్ (సనత్‌నగర్) – వాడి మూడవ, నాలుగవ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,012 కోట్లను కేటాయించారు. మొత్తం 173 కిలోమీటర్ల పొడవున కొత్త లైన్ నిర్మాణం ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలుకానుంది. పనులు పూర్తికావడానికి ఐదు సంవత్సరాలు సమయం పడనుంది.
కేంద్రం సికింద్రాబాద్-వాడి లైన్ ప్రాజెక్టుతో పాటు గుజరాత్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో మరో మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ నాలుగు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 12,328 కోట్లుగా ఉండగా, కొత్త ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా 565 కి.మీ. రైల్వే నెట్‌వర్క్ పెరుగుతుంది. 47 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. 3,100కిపైగా గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రవాణా సౌలభ్యం పెరగడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి, కాలుష్యం కూడా తగ్గుతుంది.
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్.. స్కూళ్లకు UIDAI కీలక సూచన
భారత్‌లో ఆధార్ నెంబర్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. పిల్లల విషయంలో ఇది మరింత కీలకం. UIDAI నిబంధనల ప్రకారం, పిల్లలు 5 ఏళ్ల వయసులో ఒకసారి, 15 ఏళ్ల వయసులో మరోసారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయాలి. ఈ అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, NEET, JEE, CUET వంటి కీలక పరీక్షల నమోదు సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని UIDAI హెచ్చరించింది.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి UIDAI స్కూళ్లను ముందుకు తెచ్చింది. విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ స్టేటస్‌ను UDISE+ అప్లికేషన్ ద్వారా స్కూల్ యాజమాన్యం సులభంగా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల మంది పిల్లల ఆధార్ అప్డేట్ పెండింగ్‌లో ఉందని UIDAI వెల్లడించింది. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని UIDAI CEO భువనేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
కామన్వెల్త్ గేమ్స్ 2030.. బిడ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Commonwealth Games 2030: భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయిగా, 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ వేసిన బిడ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు, ట్రైనింగ్ సదుపాయాలు ఈ గేమ్స్ నిర్వహణకు సరైన వేదికగా ఎంపికయ్యాయి. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) కూడా దీనికి మద్దతు తెలిపింది.
ఈ నెల 31తో బిడ్ సమర్పణ తుది గడువు ముగియనున్న నేపథ్యంలో, IOA అవసరమైన పత్రాలు పూర్తి చేస్తోంది. భారత్ చివరిసారి 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించింది. ఈసారి 2030 ఎడిషన్‌ను ఘనంగా ఆతిథ్యం ఇచ్చే దిశగా కేంద్రం ముందడుగు వేస్తోంది. అంతేకాక, 2036 ఒలింపిక్స్ బిడ్‌కూ భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 3 వేల మంది క్రీడాకారులకు నెలకు రూ.50 వేల సాయం అందిస్తుండగా, 2036 నాటికి ఒలింపిక్స్‌లో టాప్ 5లో నిలవడం భారత్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్ను .. రహస్య ఆపరేషన్లు!
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. తాజాగా ఈ అంశంపై మరోసారి కలకలం రేగింది. ట్రంప్‌తో సంబంధాలున్న ముగ్గురు అమెరికన్లు ప్రస్తుతం గ్రీన్‌లాండ్‌లో రహస్య కార్యకలాపాలు జరుపుతున్నారని ఆ దేశ అధికారిక మీడియా DR బయటపెట్టింది. వీళ్లు అక్కడి పరిస్థితులను ప్రభావితం చేసి, గ్రీన్‌లాండ్-డెన్మార్క్ సంబంధాలను బలహీనపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
డెన్మార్క్ ప్రతిస్పందన
ఈ పరిణామంపై డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకీ రాస్‌ముసెన్ తీవ్రంగా స్పందించారు. "గ్రీన్‌లాండ్‌పై కొన్ని విదేశీ శక్తులు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదు. మా అంతర్గత విషయాల్లో తలదూర్చడాన్ని సహించం" అని స్పష్టం చేశారు. డెన్మార్క్ అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన దీవి. లిథియం, రాగి వంటి ప్రాకృతిక వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అమెరికా దానిపై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు తయారీలో ఈ ఖనిజాలకు భారీ డిమాండ్ ఉంది. గతంలో ట్రంప్ పలుమార్లు "గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలి" అన్నా, డెన్మార్క్ మాత్రం స్పష్టంగా "అది అసాధ్యం" అని తేల్చి చెప్పింది.
