Asianet News TeluguAsianet News Telugu

నేను పెళ్లి చేసుకోలేదా? మీకెలా తెలుసు? యశ్ దాస్‌గుప్తా గురించి టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ వెల్లడి

టీఎంసీ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితం ఇటీవలి కాలంలో ఎక్కువగా మీడియాలోనే నానింది. తాజాగా, ఆమె ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మరోసారి వార్తల్లోకి వచ్చారు. నిఖిల్ జైన్‌తో విడిపోయిన తర్వాత ఆమె ఓ బాబుకు జన్మనిచ్చారు. ఆ బాబు తండ్రి ఎవరు అని ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పెళ్లి గురించీ మాట్లాడటానికి ఆమె గోప్యత పాటించారు. ఆమె ప్రస్తుతం కలిసి ఉంటున్న యశ్‌ దాస్‌గుప్తా, బాబు, తాను..  కలిసి ఒక కుటుంబం అని వివరించారు. తాను పెళ్లి చేసుకోలేదని ఎలా తెలుసు అని తిరిగి ప్రశ్నించారు.
 

tmc mp nusrat jahan asks how do you know I am not married
Author
Kolkata, First Published Jan 26, 2022, 1:32 PM IST

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ(TMC MP), ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్(Nusrat Jahan) వ్యక్తిగత జీవితం ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉంటూ వస్తున్నది. ఆమె గురించిన ఏ చిన్న విషయమైనా సంచలనంగానే మారింది. తాజాగా, ప్రస్తుతం ఆమె కలిసి ఉంటున్న భాగస్వామి యశ్ దాస్‌గుప్తా(Yash Dasgupta) గురించి ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ఆయనతో ఆమెకు ఉన్న సంబంధం(Relationship)పైనా నోరు విప్పారు. తాను, తన కుమారుడు, యశ్ దాస్‌గుప్తా అంతా కలిసి ఒక కుటుంబం అని పేర్కొన్నారు. అయితే, పెళ్లి విషయాల్లోకి వెళ్లాలని భావించడం లేదని తెలిపారు. నేను పెళ్లి(Marriage) చేసుకోలేదా? మీకు ఎలా తెలుసు? అని తిరిగి ప్రశ్నించారు. పెళ్లి, భర్త గురించి తనదైన శైలిలో స్పందించారు.

తనకు పుత్రుడు జన్మించిన తర్వాత తన జీవితమే పూర్తిగా మారిపోయిందని నుస్రత్ జహాన్ అన్నారు. నిఖిల్ జైన్‌తో బంధాన్ని రద్దు చేసుకున్న తర్వాత యాక్టర్ యశ్ దాస్‌గుప్తాతో కలిసి ఉంటున్నారు. అయితే, తాను జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించగా.. ఆమె వెల్లడించడానికి నిరాకరించారు. వదంతులు, పుకార్లకు తలొగ్గనని చెబుతూ.. భారత చట్టాల ప్రకారం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా జీవించే హక్కు తనకు ఉన్నదని స్పష్టం చేశారు.

నుస్రత్ జహాన్, యశ్ దాస్‌గుప్తాలు కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. వారి మధ్య సంబంధాన్ని వారు బహిరంగంగానే వెల్లడించారు. వికిపీడియా యశ్ దాస్‌గుప్తాను డొమెస్టిక్ పార్ట్‌నర్‌గా పేర్కొంటున్నది. దీనిపై ప్రశ్నించగా.. ఆ పదాన్ని మార్చాలని తాను భావించడం లేదని వివరించారు. ‘నేను ఎందుకు మార్చాలి? అంటే.. మేం ఒక కుటుంబం’ అంటూ వివరించారు. కాగా, పెళ్లి గురించి ప్రస్తావించగానే.. ‘పెళ్లి మ్యాటర్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను పెళ్లి చేసుకోలేదని మీకు ఎలా తెలుసు?’ అని ఎదురు ప్రశ్నించారు.

‘నేను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ గర్ల్‌గానే ఉన్నాను. నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. మంచి అయినా చెడు అయినా.. సరైనవి కావొచ్చు.. కాకపోవచ్చు.. కానీ, అవన్నీ నా నిర్ణయాలే. కాబట్టి.. ప్రతి యాక్షన్‌కు నేను బాధ్యత వహిస్తాను’ అని తెలిపారు.

నుస్రత్ జహాన్ 2019లో టర్కీలోని బోడ్రమ్ నగరంలో బిజినెస్ మ్యాన్ నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకున్నారు. కాగా, గతేడాది జూన్‌లో వారిద్దరూ వేరుగా ఉంటున్నట్టు, విడిపోయినట్టు నుస్రత్ జహాన్ వెల్లడించారు. ఆ తర్వాతే ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాము చాలా కాలం క్రితమే విడిపోయినట్టు పేర్కొన్నారు. అయితే, తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలని భావించి వెల్లడి చేయలేదని స్పష్టం చేశారు. కాగా, 2021 ఆగస్టు 26న ఆమె బాబుకు జన్మనిచ్చారు. ఆ బాబుకు పేరు యిషన్ జే దాస్‌గుప్తాగా పేరు పెట్టారు. అయితే, ఆ బాబు తండ్రిగా దేబాశిస్ దాస్‌గుప్తా పేరు ఉన్నట్టు ఓ బర్త్ సర్టిఫికేట్ వెలుగులోకి వచ్చింది. యశ్ దాస్‌గుప్తా మరో పేరు దేబాశిష్ కూడా. ఈ నేపథ్యంలో ఆ బాబు తండ్రి ఎవరు అని అడిగారు. అయినప్పటికీ ఆ విషయాలను నుస్రత్ జహాన్ గోప్యంగానే ఉంచాలని నిర్ణయించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios