పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. ఈ క్రమంలో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను పదవి నుంచి తప్పించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది.

ఆయన రాజ్యాంగ పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ మీడియాకు తెలిపారు.  

ఇటీవలి కాలంలో గవర్నర్‌ పాల్పడిన రాజ్యాంగ ఉల్లంఘనలను రాష్ట్రపతికి తెలియజేసినట్లు శేఖర్‌రాయ్‌ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 156 క్లాజ్‌ 1 ప్రకారం ఆయనను తొలగించాలని కోరామన్నారు.

గతేడాది పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం ట్వీట్లు, విలేకరుల సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ, కార్యనిర్వాహక వర్గ పనితీరుపై జగ్‌దీప్ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మరకు రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారని శేఖర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా గవర్నర్‌ నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  

మరోవైపు గవర్నర్‌ను తప్పించాలంటూ రాష్ట్రపతికి టీఎంసీ ఎంపీలు లేఖ రాయడాన్ని బీజేపీ నేత కైలాష్‌ విజయ్‌వర్గీయ తప్పుబట్టారు. గవర్నర్‌ రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరిస్తున్నారని చెప్పారు. గవర్నర్‌ పనితీరుపై తనకున్న అభిప్రాయం మేరకే రాష్ట్రపతి నడుచుకుంటారని వర్గీయ స్పష్టం చేశారు.