టిక్ టాక్ ఛాలెంజ్ ఓ  యువకుడి ప్రాణాలు తీసింది. ఈ మధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన టిక్ టాక్ మ్యూజిక్ యాప్ చాలా మంది బానిసలుగా మారుతున్నారు. ఈ కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా రాజస్థాన్ కి చెందిన ఓ కుర్రాడు.. ఈ టిక్ టాక్ కారణంగా కన్నుమూశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్తాన్‌ కోటాకు చెందిన ఓ బాలుడు టిక్‌టాక్‌ యాప్‌కు బానిసగా మారాడు. ఈ క్రమంలో ఓ టిక్‌టాక్‌ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. దాని నిభందనల ప్రకారం మంగళసూత్రం, చేతికి గాజులు ధరించాడు. అనంతరం బాత్రూమ్‌లోకెళ్లి మందపాటి చైన్‌తో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం బుధవారం రాత్రి పూట జరిగింది. దాంతో కుటుంబ సభ్యులకు వెంటనే తెలియలేదు.

పొద్దున లేచిన దగ్గర నుంచి కుమారుడు కనపడకపోవడంతో.. ఇళ్లంతా వెతికారు. చివరకూ బాత్రూమ్‌లో ఉరి వేసుకుని చనిపోయిన బాలుని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా బాలుని తండ్రి మాట్లాడుతూ.. ‘రాత్రంతా నా కుమారుడు టిక్‌టాక్‌లోనే మునిగి పోయి ఉండేవాడు. వద్దని వారిస్తే.. మాతో గొడవ పడేవాడు. దానికి బానిస అయ్యాడు. టిక్‌టాక్‌ చాలెంజ్‌లో భాగంగానే నా కుమారుడు ఇలా చనిపోయాడు’ అని తెలిపారు. బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.