Asianet News TeluguAsianet News Telugu

పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

జమ్మూ కశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో (Pulwama district) జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిని జైషే మహమ్మద్‌కు చెందినవారిగా గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయుడు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.

three jem terrorists killed in encounter in jammu and kashmir pulwama district
Author
Pulwama, First Published Jan 5, 2022, 11:01 AM IST

జమ్మూ కశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో (Pulwama district) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. పుల్వామా జిల్లాలోని చంద్‌గామ్ ప్రాంతంలో (Chandgam area) భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టుగా పోలీసులు తెలిపారు. వారిని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందినవారిగా పోలీసులు పేర్కొన్నారు. 

ఈ ఘటనకు సంబంధించి కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఉగ్రవాదులు Jaish-e-Mohammedకు చెందినవారని, వారిలో ఒకరు పాకిస్తాన్ వాసి కూడా ఉన్నాడని తెలిపారు. ఘటన స్థలం నుంచి రెండు M-4 కార్బైన్‌లు, ఒక AK సిరీస్ రైఫిల్‌తో పాటుగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకన్నట్టుగా చెప్పారు. 

 

ఇక, జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్ జిల్లాలోని ఓకే గ్రామంలో భద్రతా బలగాలు.. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని, అది ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసు అధికారులు తెలిపారు. భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని అధికారి చెప్పారు. హత్యకు గురైనవారు స్థానికులని, వారు లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్నారని తెలిపారు. వారు అనేక ఉగ్రవాద నేరాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios