పాట్నా: బీహార్ లో వరదలు విలయతాండవం సృష్టిస్తున్నాయి. భగల్ పూర్ ప్రాంతంలో నిరవధికంగా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. గోడ శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

ఇప్పటికే బీహార్ లో గత శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పాట్నా లోని పలు కాలనీల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. 

భారత వాతావరణ శాఖాధికారులు జారీ చేసిన రెడ్ అలెర్ట్ ను ఆదివారం కూడా కొనసాగించనున్నారు. ఇప్పటికే ఈ విషయమై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ట్విట్టర్ వేదికగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన ప్రాంతాల నుండి ప్రజలను తరలించే ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపారు.