ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికలపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి చేశారు. ఆ ముగ్గురు బాలికలు అక్కాచెల్లెళ్లు కాగా.. వారు దళిత వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.

గోండా పట్టణానికి చెందిన 8,12,17 సంవత్సరాల వయసు గల ముగ్గురు దళిత సోదరీమణులు సోమవారం రాత్రి నిద్రపోతుండగా వారిపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు బాలికలకు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మరో బాలిక ముఖంపై గాయమైంది. 

యాసిడ్ దాడిలో గాయపడిన ముగ్గురు బాలికలను జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ యాసిడ్ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తెలియరాలేదు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. ఇప్పటికే హాథ్రస్ లో ఓ దళిత యువతిపై అత్యాచారం చేసి అనంతరం ఆమె నాలుక కోసేసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.  ఈ ఘటన మరవకముందే.. అలాంటి ఘటనలు మరిన్ని చోటుచేసుకోవడం అందరినీ కలచివేస్తున్నాయి.