Asianet News Exclusive: అయోధ్య రాముడి విగ్రహాన్ని ఇలా ఎంపిక చేస్తాం: ఆలయ నిర్మాణ పర్యవేక్షకుడు నృపేంద్ర మిశ్రా
రామ మందిర నిర్మాణం గురించి స్పాట్‌లోకి వెళ్లి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న నృపేంద్ర మిశ్రాతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విశేషాలు, వారి వ్యక్తిగత అనుభవాలు, ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి, భక్తుల తాకిడికి తగినట్టుగా అయోధ్య అభివృద్ధి గురించి మిశ్రా వివరించారు.
2024 జనవరి సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో జరగబోయే బృహత్కార్యం గురించి ఉత్కంఠ పెరుగుతున్నది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగితే పూజలు చేసే అవకాశం కోసం రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అసాధారణ మందిరం అసమాన శిల్పనైపుణ్యానికి, ఇంజినీరింగ్‌కు తార్కాణం. జనవరి నెలలో ఈ మందిరం ప్రారంభం కానున్నది.
ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 2.7 ఎకరాల్లో 54,700 చదరపు అడుగుల వైశాల్యంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ మహత్కార్యాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పర్యవేక్షిస్తున్నారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేశ్ కల్రా చేసిన ఇంటర్వ్యూలో నృపేంద్ర మిశ్రా కీలక విషయాలు వెల్లడించారు. కీర్తిమంతుడైన శ్రీ రాముడు, అయోధ్య నగర పవిత్రతను, వీటి పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి సంబంధించి కొన్ని విషయాలు తెలిపారు.
నృపేంద్ర మిశ్రాను కలవడానికి రాజేశ్ కల్రా ఏప్రిల్ 2022లో సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించారు. అప్పుడు అక్కడున్న సవాళ్లు స్పష్టంగా కనిపించాయి. నృపేంద్ర మిశ్రా కూడా రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలు తెలిపారు. ఇక అక్కడి నుంచి 2023 సెప్టెంబర్‌లోకి వద్దాం. ఆలయ ప్రారంభానికి కొన్ని నెలల ముందటి కాలం ఇది. ఇప్పుడు మందిర నిర్మాణ పురోగతి, సాధించిన మైలురాళ్లు, భారీ రామ మందిరంలో రామ భక్తులు చూడబోతున్న విషయాలను నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ప్రతి ఒక్కరికీ ఇక్కడి నుంచే ప్రవేశం అని మిశ్రా చూపించారు. ‘భక్తులు ఈ పక్క నుంచి వచ్చి ఈ టన్నెల్, నిర్మాణంలో ఉన్న ఈ బౌండరీ వాల్ నుంచి సాగుతారు. వాళ్లు మెట్లు ఎక్కి ఈ లెవెల్‌కు వస్తారు. ఆ తర్వాత ఇలాగే పై పైకి వెళ్లుతారు. వెల్ కమ్ ఎంట్రెన్స్ వద్ద మనకు మూడు వైపులా మూడు ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. తొలి ప్లాట్‌ఫామ్ వద్ద సింఘ్ ద్వార్, సింహం, విగ్రహం ఉంటుంది. రెండో ప్లాట్ ఫామ్ వద్ద ఏనుగు విగ్రహం ఉంటుంది. ఈ రెండు వైపులా హనుమంతుడు, గరుడ విగ్రహాలు ఉంటాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఇదే గ్రాండ్ వెల్‌కమ్’
‘మీరు ప్రవేశించగా, ఇక్కడ ఐదు మండపాలు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మండపాల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రౌండ్ ఫ్లోర్ మేం పూర్తి చేస్తాం. అంటే.. భక్తులు ప్రవేశించి మండపాల్లోకి వెళ్లవచ్చు. అలాగే, గర్భగుడి వరకు మీది వైపుకు వెళ్లవచ్చు. అక్కడ దేవుడి దర్శనం పొంది ఎడమ వైపు నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. ఈ నిర్మాణమే మాకు చాలెంజ్ వంటిది. వచ్చే మూడు నెలల్లో డిసెంబర్ 31వ తేదీలోపు ఈ నిర్మాణాన్ని మేం పూర్తి చేస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌లోపు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తవుతుంది. 2024 డిసెంబర్ వరకు మొత్తం మందిర నిర్మాణం పూర్తవుతుంది. అది రెండో దశ’ అని మిశ్రా వివరించారు.
ఈ భారీ రామ మందిర నిర్మాణంలో వారికి ఎదురైన సవాళ్లు, సమస్యల గురించి మిశ్రా విపులంగా వివరించారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఇంటర్వ్యూలో మిశ్రా (ప్రధానమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ) చెప్పిన కొన్ని మైలురాళ్లు ఇవి:
- నిర్మాణం కోసం పునాది వేయడం (రాఫ్ట్ ఫౌండేషన్)
- ఈ నిర్మాణం భూకంపం, ఇతర వైపరిత్యాలను ఎదుర్కొని నిలబడేలా జాగ్రత్తలు తీసుకోవడం
- నైపుణ్యవంతంగా ఈ రాళ్లు నిర్దేశించిన స్థలంలో పెట్టడం
- 350 స్తంభాలపై చెక్కాల్సిన బొమ్మలను ఎంపిక చేయడం, ఆ డిజైన్లను సిద్ధం చేయడం. ఈ 350 స్తంభాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో 170 పిల్లర్లు ఉంటాయి. ఒక్కో స్తంభంపై 25 నుంచి 30 బొమ్మలు ఉంటాయి.
- ఆలయ ప్రాంగణంలోకి వచ్చే ఏరియాల్లో రామ కథను 100 కుడ్య చిత్రాల ఆధారంగా వివరించే పని కొనసాగుతున్నది.
ఆలయ నిర్మాణంలో ఎదురైన సవాళ్ల గురించి మిశ్రా మాట్లాడుతూ.. భిన్నాభిప్రాయాలతో డీల్ చేయడం పెద్ద సాహసంగా మారిందని చెప్పారు. పైల్ ఫౌండేషన్ వేయాలా? రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలా? వంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయని వివరించారు. ఇలా అనేక ముఖ్యమైన విషయాలను మిశ్రా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: Asianet News Exclusive Interview: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం..
రామ జన్మభూమిలో భారత పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపినప్పుడు బయల్పడ్డ కళాఖండాలను ఈ ఆలయ నిర్మాణానికి ప్రేరణగా తీసుకున్నారా? అని అడగ్గా.. నృపేంద్ర మిశ్రా ఇలా సమాధానం ఇచ్చారు. ‘స్థూలంగా చెప్పాలంటే, ఆ ఆర్ట్‌వర్క్‌లను ఒక విధంగా ఈ ఆలయ నిర్మాణ శైలిలో వినియోగించడం లేదు. ఆ కళాఖండాలు ఇక్కడ రామాలయం ఉండేదని నిరూపిస్తున్నాయి. అది చాలా పురాతనమైనదని నిరూపిస్తున్నాయి. దాని వెనుక చరిత్ర ఉన్నదని చెబుతున్నాయి. ఆ కాలాన్ని గణించడానికి ఉపయోగపడుతున్నాయి. వీటన్నింటినీ ఇక్కడ నిర్మిస్తున్న మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతాం’ అని మిశ్రా చెప్పారు.
గర్భగుడి గురించి మిశ్రా సుదీర్ఘంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 ఆగస్టు 5వ తేదీన ఇక్కడే శంకుస్థాపన చేశారు. రాముడి మూడు విగ్రహాలను చెక్కడానికి ముగ్గురు శిల్పులకు పని అప్పజెప్పామని వివరించారు. అందులో నుంచి ట్రస్టీ సభ్యులు ఒక విగ్రహాన్ని ఎంపిక చేస్తారు. ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేస్తారు.
‘ప్రాణ ప్రతిష్టత కార్యక్రమం, పూజలు జనవరి 24, 2024 నుంచి మొదలవుతాయి. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం మేం ప్రధానమంత్రిని ఆహ్వానించాం. ఆయన నుంచి సమాధానం ఇంకా వినాల్సి ఉన్నది. 24వ తేదీ వరకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ తేదీల మధ్య ప్రధానమంత్రి నిర్ణయించిన రోజున తుది ప్రాణ ప్రతిష్టను పూర్తి చేస్తాం. అప్పటి నుంచి దేవుడిని అందిరికి చూపిస్తాం. ఆ మరుసటి రోజు నుంచే భక్తులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు’ అని మిశ్రా వివరించారు.
‘1,25,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. 12 గంటలపాటు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఆ లెక్కన ఒక్కో భక్తుడు 25 సెకండ్లపాటు దేవుడిని దర్శించుకోవచ్చు. రామ నవమినాడు భక్తుల సంఖ్య మూడు నుంచి ఐదు లక్షలకు చేరవచ్చు. కాబట్టి, అప్పుడు ఒక్కో భక్తుడు 17 సెకండ్ల దర్శనం మాత్రమే పొందే అవకాశం ఉన్నది’ అని చెప్పారు.
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేశ్ కల్రా తీసుకున్న ఇంటర్వ్యూలో నృపేంద్ర మిశ్రా.. అయోధ్య కమిషనర్ పని తీరును మెచ్చుకున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాల గురించి అయోధ్య కమిషనర్ ప్రెజెంటేషన్ ఇచ్చాడని మిశ్రా తెలిపారు. ‘ఎలాంటి సౌకర్యాలు అవసరం, ఎలాంటి ఆహారం అవసరం, వేర్వేరు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి, అప్పుడు ఉత్పన్నమయ్యే భాషాపరమైన సవాళ్లు ఏమిటీ వంటి అనేక విషయాలను వివరంగా చెప్పారు. ఆయన శాయశక్తుల కృషి చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పూనుకునే ఉన్నది’ అని మిశ్రా తెలిపారు.
మిశ్రా మాట్లాడుతూ.. ‘రోడ్లను విస్తరించడానికి తవ్వి నిర్మిస్తున్న రోడ్డు దూరం 13 కిలోమీటర్లు. అంచనా ప్రకారం, ఇందులో 6.5 కిలోమీటర్ల మేరకు డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. ఆలయానికి తీసుకువచ్చే ప్రధాన దారులు, ఆలయాన్ని అనుసంధానం చేసే దారులపై రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తవుతాయి. అయితే, పౌర సదుపాయాలకు సంబంధించి నీరు, సీవేజ్, డ్రైనేజీ వంటివాటిపై వారు పనిచేస్తున్నారు. డిసెంబర్‌లోపు చూపించే ఫలితాల కోసం వారంతా సంకల్పంతో పని చేస్తున్నారు.’ అని తెలిపారు.
మీరు పంచుకోవాలనుకుంటున్న ఏవైనా ఆసక్తికర అంశాలు ఉన్నాయా? అని అడగ్గా మిశ్రా తన సమాధానంలో విశ్వాసం, ప్రజల విరాళాల గురించి మాట్లాడారు. ‘ఈ ఆలయ నిర్మాణంలో దైవ జోక్యం ఎలా ఉన్నదనే రీతిలో ఈ ఆసక్తికర అంశాలు ఉంటాయి. తుది ఫలితం ఎలా ఉంటుందనేది దేవుడికే తెలుసు. దీని కోసం ట్రస్టు రూ. 3,500 కోట్లు సమకూర్చగలిగింది. ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నదో ఇది వెల్లడిస్తుంది. తాము ఇచ్చే డబ్బులను సరైన మార్గంలో ఆలయ నిర్మాణానికే ఖర్చు పెడతారనే నమ్మకం కూడా ప్రజల్లో ఉన్నదని ఇది తెలుపుతుంది.’ అని వివరించారు.
ముగింపు పలుకుల్లో నృపేంద్ర మిశ్రా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఈ భారీ ప్రాజెక్టుకు ఆయన ఒక అదృశ్య ప్రేరణా శక్తిగా ఉన్నారని వివరించారు. ‘మొత్తం ప్రక్రియ వెనుక అంటే నిర్ణయాలు తీసుకోవడం, నిర్మాణం, పురోగతి ప్రతి మలుపులో ఎక్కడో ఓ చోట కనిపించకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణ ఉన్నదని అనిపించడం చాలా ఆసక్తికరంగా తోస్తుంది. ఆయన పర్యవేక్షించలేదు. కానీ, ఇక్కడ జరిగే ప్రతి విషయం ఆయనకు తెలుసు అని నేను నమ్ముతాను. అదే మాకు ఒక సంతృప్తినిచ్చే విషయం. ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత లక్షలాది మంది తప్పకుండా ఈ రామ మందిర నిర్మాణంలో ప్రధానమంత్రి ప్రముఖంగా ఉన్నారని ఏదో ఒక విధంగా విశ్వసిస్తారు’ అని మిశ్రా చెప్పారు.