కుక్కకి విశ్వాసం ఎక్కువ అని అందరూ చెబుతుంటారు. ఒక్క పూట తిండి పెట్టినా.. తనకు ఆహారం పెట్టిన వ్యక్తి ఇంటికి కాపలా కాస్తుందని చెబుతుంటారు. అయితే.. ఓ పెంపుడు కుక్క మాత్రం అంతకు మించిన విశ్వాసం తన యజమాని పట్ల చూపించింది. అనారోగ్యానికి గురైన యజమాని తిరిగి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేంత వరకు హాస్పిటల్ బయట కాపలా కాసింది. ఈ సంఘటన టర్కీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టర్కీలోని ట్రాబ్ జోన్ ప్రాంతానికి చెందిన సెమల్ సెంటుర్క్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానిని ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అది కూడా ఆయన పట్ల ఎంతో విశ్వాసంగా ఉండేది.

కాగా.. ఈ నెల 14న సెమల్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గమనించిన కుక్క బోనుక్‌ ఆ అంబులెన్స్‌ వెంట పరుగులు దీసి ఆసుపత్రికి చేరింది. రోజంతా అక్కడే ఉన్నది. చివరకు సెమల్‌ కుమార్తె ఐనూర్ ఎగెలి రాత్రి వేళ దానిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ కుక్క మరునాడు ఉదయమే ఆ ఆసుపత్రి వచ్చింది. యజమాని కోసం డోర్‌ వద్ద రోజంతా నిరీక్షించి రాత్రికి తిరిగి ఇంటికి వెళ్లింది. 

ఇలా వారం రోజుల పాటు ఆ కుక్క ఆసుపత్రి వద్ద యజమాని కోసం పడిగాపులు కాసింది. ఈ నెల 20న యజమాని సెమల్‌ కోలుకున్నారు. దీంతో వీల్‌ చైర్‌లో ఆసుపత్రి డోర్‌ వద్దకు వచ్చి తన కుక్కను చూసి పరవశించిపోయారు.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత విశ్వాసమా అంటూ అందరూ ఆ కుక్కను అభినందిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మనుషులు కూడా ఇంతటి అభిమానం చూపించడం లేదని పేర్కొనడం గమనార్హం.