ప్రపంచాన్ని కొద్దినెలల పాటు స్తంభింపజేసిన కరోనా వైరస్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. అమెరికా, బ్రెజిల్, ఇటలీ, యూకే, ఫ్రాన్స్‌లలో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది. ఆయా దేశాల్లో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని దేశాల్లో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు.

ఇక భారత్ విషయానికి వస్తే... దేశంలోని అన్ని చోట్లా ఒకే రకమైన పరిస్ధితి లేదు. ఓనం పండుగ తర్వాత కేరళలలో కేసులు ఊపందుకున్నాయి. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా తీవ్ర‌త మళ్లీ పెరుగుతుంది.

దీంతో అక్కడ క‌రోనా మూడ‌వ ద‌శ‌కు చేరుకున్నట్లుగా అభిప్రాయాల‌ు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. మూడో వేవ్ ప్రారంభమైంద‌న‌డానికి ఇప్పుడే నిర్ధార‌ణ‌కు రాలేమ‌ని,  మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు.

అయితే ఢిల్లీలో క‌రోనా మూడ‌వ ద‌శ‌కు చేరే అవ‌కాశం మాత్రం ఉంద‌ని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక్క రోజులోనే 5,673 కేసులు నమోదు కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. గ‌త వారం రోజులుగా ఢిల్లీలో రోజూ స‌గ‌టున 4వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత త‌గ్గుతున్న‌ప్ప‌టికీ రాజ‌ధానిలో మాత్రం కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టం ఊహించ‌లేనిదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

వచ్చేది పండుగ‌ల సీజ‌న్‌తో పాటు శీతాకాలం కావ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు అనుస‌రిస్తోన్న ప‌ద్ధ‌తుల్లో కొన్ని మార్పులు చేశామ‌ని జైన్ వెల్లడించారు.  ఓ వ్య‌క్తికి క‌రోనా సోకితే అతని కుటుంబంతో స‌హా వారి స‌న్నిహితుల‌కూ క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తామ‌ని వివ‌రించారు.

మొద‌ట‌గా వ్యాధి నిర్ధార‌ణ అయిన 4-5 రోజుల అనంద‌రం తిరిగి మ‌రోసారి ప‌రీక్ష‌లు చేస్తామ‌ని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలోనే ఢిల్లీలో రోజుకు స‌గ‌టున 15 వేల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ముందే హెచ్చ‌రించింది.

ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి మొద‌ట ప‌రీక్ష‌లు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వ‌హించాల‌ని, ఆసుప‌త్రుల్లో ఇందుకు తగ్గ‌ట్లు ప‌డ‌క‌లు సిద్ధం చేయాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచింంచింది. ప్ర‌స్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండ‌గా మొత్తం కేసుల సంఖ్య 3.7 ల‌క్ష‌ల‌కు చేరుకుంది