అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు రాజధాని లాంటి ఉత్తరప్రదేశ్‌లతో దొంగలు రెచ్చిపోయారు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌నే కొల్లగొట్టారు. సాహిదాబాద్ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర వస్తువులను పోలీసులు స్టేషన్‌లోని స్టోర్‌ రూంలో భద్రపరుస్తుంటారు.

ఈ క్రమంలో మే 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు లోపలికి చొరబడ్డారు. 90 బ్యాటరీలు, రెండు గ్యాస్ సిలిండర్లు, ఫోన్లు, సీసీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలను ఎత్తుకెళ్లారు. దొంగలు మొత్తం ఊడ్చికెళ్లినా కానీ పోలీసులకు దొంగతనం జరిగిన విషయం తెలియదు.

24 గంటల తర్వాత మే 20వ తేదీ ఉదయం స్టోర్ ఇన్‌ఛార్జ్ గది దగ్గరకు వెళ్లగా.. తాళం పగులకొట్టి కనిపించడంతో ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చోరీతో సంబంధమున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.