బెంగళూరులో దొంగలు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లి దాంట్లో నుంచి నగదును తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనలో రూ.12 లక్షలు చోరీకి గురయ్యాయి. ఇదే పట్టణంలో వారం రోజుల కింద కూడా దొంగలు ఏటీఎంలో నుంచి నగదును దోచుకెళ్లారు. 

ఓ ప్ర‌భుత్వ రంగ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం ను దొంగ‌లు ఎత్తుకెళ్లారు. దానిని 2 కిలో మీట‌ర్ల దూరం తీసుకెళ్లి అందులో నుంచి రూ. 12 ల‌క్ష‌ల న‌గ‌దును దోచుకున్నారు. అనంత‌రం ఆ ఏటీఎంను అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి చోటు చేసుకోగా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

బెంగళూరు శివార్లలోని చిక్కగొల్లరహట్టి గ్రామంలోని మగడి రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ATM కియోస్క్ సెంట‌ర్ ఉంది. ఏప్రిల్ 14 రాత్రి ఒక దొంగ‌ల ముఠా ఆ ఏటీఎం సెంట‌ర్ నుంచి మెషిన్ ను వేరు చేసింది. ఈ చోరీ స‌మ‌యంలో దొంగ‌లు అక్క‌డున్న సీసీ కెమెరాల‌ను కూడా ధ్వంసం చేశారు. డిజిటల్ వీడియో రికార్డర్‌ను తీసుకెళ్లారు.

మదనాయకనహళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం మెషిన్‌ను అపహరించిన దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కియోస్క్‌లోని డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఎత్తుకెళ్లారు. అయితే, సమీపంలోని వాణిజ్య సంస్థల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ముఠాను గుర్తించామ‌ని తెలిపారు. వారిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. 

ఆ ఏటీఎం హౌస్ కీపింగ్ సిబ్బంది రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. “ నేను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఏటీఎం సెంట‌ర్ ని తెరిచి, రాత్రి 10 గంటలకు మూసివేస్తాను. అయితే వ‌ర్షం కార‌ణంగా ఏప్రిల్ 14వ తేదీన రాత్రి 9.25 గంటలకే మూసేశాను. తెల్లారి ఉదయం 5.45 గంటలకు సెంట‌ర్ వ‌ద్ద‌కు తిరిగి వ‌చ్చాను. అక్క‌డ ఏటీఎం మెషిన్ క‌నిపించ‌లేదు. దీంతో నేను హౌస్ కీపింగ్‌ కంపెనీకి ఈ విష‌యాన్ని తెలియ‌జేశాను. వారి ఆదేశాల ఆధారంగా ఫిర్యాదు చేశాను.” అని పేర్కొంటూ 15వ తేదీన ఉద‌యం 8 గంటలకు రామచంద్ర పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ కేసు మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో న‌మోదు అయ్యింది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తావరెకెరె పోలీసులకు శ్మశాన వాటికలో ధ్వంస‌మైన ఏటీఎం మెషిన్ ఉంద‌ని స‌మాచారం అందింది. సాయంత్రం రెండు స్టేషన్ల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో మెషిన్ తెరిచి నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

ఏప్రిల్ 12వ తేదీ రాత్రి బెంగళూరు-మైసూరు రోడ్డులోని మద్దూర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ నుంచి రూ. 20 లక్షల నగదును దొంగిలించిన ముఠా కూడా ఇదే విధమైన చోరీకి పాల్పడినట్లు పోలీసులకు వారి విచారణలో తెలిసింది. అయితే ఆ చోరీలో ఏటీఎం ఆ సెంబ‌ర్లోనే ఉంది. కానీ అందులో న‌గ‌దును మాత్రమే దుండ‌గ‌లు ఎత్తుకెళ్లారు. కాగా ఇక్క‌డ కూడా అదే ముఠా దొంగ‌త‌నం చేసింద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దొంగ‌త‌నంలో ఏటీఎం మెషిన్ తీసుకెళ్లేందుకు దొంగ‌లు చోరీ చేసిన వాహ‌నాన్ని ఉప‌యోగించినట్టు పోలీసులు భావిస్తున్నారు.