కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి ఇప్పుడు న్యూస్ మేకర్ గా మారింది. కేరళలోని పాలక్కాడ్ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జ్యోతిది ఓ త్యాగశీల ప్రేమకథ. అదే పార్టీలకు కలిసి వస్తోంది. అదే సమయంలో జ్యోతి ప్రేమ కథ వైరల్ గా మారుతోంది.

చత్తిస్‌గడ్‌, దంతెవాడకు చెందిన జ్యోతి, కేరళ పాలక్కాడ్ కు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో పనిచేస్తున్న వికాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ ప్రేమ కథ మామూలుది కాదు. 2010లో వీరి ప్రేమకథ మొదలయ్యింది. ఎలాగంటే.. దంతెవాడకు చెందిన జ్యోతి  అప్పుడు నర్సింగ్‌ చదువుతోంది. జనవరి 3న ఆమె తన హాస్టల్‌ నుంచి ఇంటికి వెళ్లడానికి బస్‌ ఎక్కింది. అదే బస్‌లో ఎవరో మిత్రుణ్ణి కలిసి క్యాంప్‌కు వెళుతున్న వికాస్‌ కూడా ఉన్నాడు. 

వికాస్‌ది విండో సీట్‌ కావడంతో విండో కడ్డీల మీద తల వాల్చి నిద్రపోతున్నాడు. జ్యోతి అతని వెనుక కూచుని ఉంది. ఇంతలో ఒక లారీ అదుపుతప్పి వేగంగా వస్తున్నట్టు జ్యోతి గ్రహించింది. అది విండోల మీదకి వస్తోంది. జ్యోతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వికాస్‌ను లాగేసింది. కాని అప్పటికే లారీ ఢీకొనడం, జ్యోతి కుడి చేయి నుజ్జు నుజ్జు కావడం క్షణాల్లో జరిగిపోయింది. 

ఈ ఘటనతో తేరుకున్న వికాస్ జ్యోతిని వెంటనే దంతెవాడ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె చేయి తీయాల్సి వస్తుందని రాయ్ పూర్ కి తీసుకెళ్లమన్నారు. ఇంతలో తన ప్రాణాలు కాపాడడానికి ఆమె చేయి కోల్పోయిందని వికాస్ కి తెలిసింది. వైద్యానికి అయిన ఖర్చంతా వికాసే భరించాడు. అంతేకాదు తనకు పునర్జన్మనిచ్చిన జ్యోతికి పునర్జీవితం ఇవ్వాలనుకున్నాడు. 

ఇది జ్యోతికీ నచ్చింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ  జ్యోతి తండ్రి గోవింద్‌ కుండు కు ఇది ఇష్టం లేదు. వ్యతిరేకించాడు. దీంతో జ్యోతి ఇల్లు విడిచి వికాస్ తో పాలక్కాడ్‌ వచ్చేసింది. 2011 ఏప్రిల్‌లో వారిద్దరికీ పెళ్లయ్యింది. వికాస్‌ ఉద్యోగరీత్యా దేశమంతా తిరుగుతూ ఉన్నా జ్యోతి పాలక్కాడ్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. 

ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక ఎన్నికలలో సరైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీలు జ్యోతి కథ తెలిసి ఆమెను ఎన్నికలలో పోటీ చేయమని కోరాయి. జ్యోతి పాలక్కాడ్‌లో కొల్లన్‌గోడే బ్లాక్‌ నుంచి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తోంది. ‘నాకు ఓట్లు వేస్తారో లేదో తెలియదు. కాని జనం మాత్రం నా ధైర్యానికి త్యాగానికి మెచ్చుకుంటున్నారు’ అని ఆమె చెప్పింది.

ఒంటిచేత్తో  జీవితాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న జ్యోతి గెలిస్తే పదవి బాధ్యతలను కూడా అంతే సమర్థంగా నిర్వహిస్తుందనిపిస్తుందని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.