మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు ఎలాంటి సమస్యలూ లేవని సూసైడ్ నోట్ లో పేర్కొంటూ ఓ హోటల్ యజమాని ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తాను 30 ఏళ్ల దాకానే బతకాలని 9 ఏళ్ల కిందటే నిర్ణయించుకున్నాని పేర్కొన్నాడు.
ఆయనో బ్రహ్మచారి. వయస్సు 30 ఏళ్లు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. జీవితంగా సాఫీగా సాగిపోతోంది. కానీ ఆయన తొమ్మిదేళ్ల కిందటే ఓ నిర్ణయానికి వచ్చారు. 30 ఏళ్ల వరకే జీవించాలని అప్పుడే అనుకున్నారు. అతడు అనుకున్న వయస్సు రానే వచ్చింది. ఇంకేముంది ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని కూడా ఓ రాసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
‘ఇండియా టు డే’ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 30 ఏళ్ల హోటల్ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఈ బలవన్మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. హీరా నగర్ ప్రాంతంలోని అతని ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతం అంతా గాలించారు. దీంతో వారికి ఒక సూసైడ్ నోట్ లభించింది. అందులో రాసి ఉన్న విషయం చదివి పోలీసులు షాక్ అయ్యారు.
తాను 30 ఏళ్ల వరకు మాత్రమే జీవించాలని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం 2016లో తెచ్చుకున్న పిస్టల్ సమీపంలో పడి ఉంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, దీనికి ఎవరూ బాధ్యులు కాకూడదని అందులో పేర్కొన్నాడు. 30 ఏళ్లకు చనిపోవాలని తాను 9 ఏళ్ల కిందటే అనుకున్నానని నోట్ లో రాసుకొచ్చాడు. తనకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా పేర్కొన్నాడు.
ఈ ఘటనపై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ దయాశీల్ యెవాలే మాట్లాడుతూ.. సూసైడ్ నోట్ ను చూస్తే.. హోటల్ యజమాని మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలుస్తోందని అన్నారు. అయితే ఈ మరణానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని యెవాలే తెలిపారు.
జీవితంలోని ప్రతీ సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
