సీఏఏ ఆమోదయోగ్యం కాదు.. తమిళనాడులో అమలు చేయొద్దు - విజయ్ దళపతి

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం -2019ను తీసుకురావడం పట్ల తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్ దళపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో సీఏఏను అమలు చేయొద్దని కోరారు.

THE CAA is unacceptable. Don't implement it in Tamil Nadu: Vijay Thalapathy..ISR

పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను కేంద్ర హోం శాఖ సోమవారం నోటిఫై చేసింది. దీంతో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ దళపతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఏఏను అమలు చేయడం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు.  

ఈ మేరకు ఆయన మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (సీఏఏ) వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని తమిళంలో ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని తమిళనాడులో అమలు చేయకుండా చూడాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

కాగా.. ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం పట్ల విజయ్ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది బీజేపీ విభజన అజెండా అని, ప్రజలు వారికి (బీజేపీ) తగిన గుణపాఠం చెబుతారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. 

2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు నాలుగేళ్ల కిందట ఆమోదించిన సంగతి తెలిసిందే. దానికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ సీఏఏను అమల్లోకి తీసుకొచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios