కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపిస్తుందని వస్తున్న వార్తలకు తెరపడింది. రాజసభ్య సభ్యుడిగా  ఆయన పేరును నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. హర్భజన్ సింగ్ తో పాటు మరో నలుగురి పేర్లను కూడా ఆ పార్టీ ఖరారు చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) పంజాబ్ (Punjab) నుంచి రాజ్యసభ ( Rajya Sabha) అభ్యర్థిగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)ను నామినేట్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ వ‌ర్గాలు సోమ‌వారం వివ‌రాలు వెల్ల‌డించాయి. హర్భజన్ సింగ్‌తో పాటు, ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ రాఘవ్ చద్దా (Raghav Chadha), ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్ (Dr Sandeep Pathak), లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్ (Ashok Mittal)లను కూడా ఆప్ పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేసింది. 

Scroll to load tweet…

పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు వచ్చే నెలలో ఖాళీ అవుతాయి. అయితే నామినేషన్ దాఖలు చేయడానికి నేడే చివ‌రి రోజు. అందుకే సోమ‌వారం రాజ్య‌స‌భకు పంపించే స‌భ్యుల వివ‌రాల‌ను ఆప్ వెల్ల‌డించింది. 18 ఏళ్ల పాటు సాగిన అంతర్జాతీయ కెరీర్‌లో 700 వికెట్లు తీసిన హర్భజన్.. ఇటీవలే క్రియాశీల క్రీడల నుంచి తప్పుకున్నాడు. తన రిటైర్మెంట్ ప్రకటించే ముందు, 41 ఏళ్ల హ‌ర్బ‌జ‌న్ సింగ్ పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (former Punjab Congress chief Navjot Singh Sidhu) ని కలవడానికి వెళ్ళాడు. ఈ స‌మ‌యంలో వీరి ఇద్ద‌రి ఫొటోలు వైరల్ గా మారాయి. హ‌ర్బ‌జ‌న్ సింగ్ కాంగ్రెస్ లో చేరుతార‌ని ఊహాగానాలు వెలువ‌డ్డాయి. 

కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని వ‌చ్చిన ఊహాగానాల‌ను హ‌ర్బ‌జ‌న్ సింగ్ కొట్టిపారేశారు. తాను ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హర్భజన్ పంజాబ్‌లో అనేక దాతృత్వ ప్రాజెక్ట్‌లు, సామాజిక సేవా కార్యక్రమాలతో చురుగ్గా పాల్గొన్నారు. కాగా రాజ్యసభ అభ్యర్థుల ఆప్ అభ్యర్థుల జాబితా ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. ఈ విష‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా (Congress MLA Sukhpal Singh Khaira) స్పందిస్తూ.. “ఆప్ ద్వారా రాజ్యసభ కు నామినేట్ అయ్యే వారి జాబితా నిజమే అయితే.. ఇది పంజాబ్‌కు అత్యంత విచారకరమైన వార్త. మన రాష్ట్రానికి ఇది మొదటి వివక్ష అవుతుంది. పంజాబీయేతర వ్య‌క్తుల‌ను పంజాబ్ నుంచి నామినేట్ చేయ‌డాన్ని మేము వ్య‌తిరేకిస్తాం. పార్టీ కోసం ప‌ని చేసిన ఆప్ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఇది ఒక జోక్ ’’ అంటూ ట్వీట్ చేశారు. 

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్ లో ఉన్న 117 అసెంబ్లీ స్థానాలకు గానూ 92 స్థానాల్లో ఆప్ గెలుపొందింది. దీంతో రాజసభ్యకు ఆప్ తరఫున మరి కొంత మందిని పంపించే అవకాశం ల‌భించింది. ఈ రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎగువ స‌భ‌లో బ‌లం 3 నుంచి 8కి పెరుగుతుందని అంచనా. పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ 9న ఖాళీ అవుతాయి. ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ఎన్నిక‌ల సంఘం ఇది వ‌ర‌కే ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశాలు లేక‌పోతే మార్చి 31వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.