ఇటీవల కాలంలో ఫోన్ వాడకం చాలా ఎక్కువైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిపోతున్నారు. ముఖ్యంగా వీడియోగేమ్స్ లేదా మొబైల్ గేమ్స్ కు బాగా అలవాటుపడుతున్నారు.

ఎంతగా అంటే వీరు నిద్రొచ్చినా పడుకోరు.. ఆకలి అంటే ఏరుగరు. దీనిని గమనించిన పెద్దలు వారిని మందలిస్తూ ఉంటారు. కానీ ఓ యువకుడి వెబ్‌ సిరీస్‌ పిచ్చి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 75 మంది ప్రాణాలను కాపాడింది.

అదేలాగంటే.. మహారాష్ట్రలోని దొంబివిలి, కొపర్‌ ఏరియాకు చెందిన కునాల్‌ అక్కడి రెండు అంతస్తుల భవనంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి వెబ్‌ సిరీస్‌ అంటే పిచ్చి.

బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు వెబ్‌ సిరీస్‌ చూస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో కిచెన్‌లోని ఓ భాగం కూలిపోవటం గమనించాడు. ఆ వెంటనే కుటుంబానికి.. అదే భవనంలో నివాసం ఉంటున్న మిగితా అందరికి సమాచారం ఇచ్చాడు. 

దీంతో వారంతా భవనం ఖాళీ చేసి వీధుల్లోకి వచ్చేశారు. కొద్దిసేపటి తర్వాత రెండు అంతస్తుల భవనం పేక మేడలా కుప్ప కూలిపోయింది. భవనంలోని 75 మంది ప్రాణాలు కాపాడిన కునాల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయాడు.

అతడో రియల్‌ హీరో అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే శిథిలావస్థలో ఉన్న ఆ భవంతిని ఖాళీ చేయాలని అధికారులు తొమ్మిది నెలల క్రితమే నోటీసులు ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న వారు భవంతిని ఖాళీ చేయడానికి సుముఖత చూపలేదు.