అతనికి అప్పటికే వివాహమైంది. కానీ ఆ విషయాన్ని దాచి మరో మహిళకు దగ్గరయ్యాడు. సహోద్యోగిగా పరిచయమైన అతను... కొద్దిరోజుల్లోనే ఆమెను ప్రేమలోకి దింపాడు. తీరా మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరు జిల్లా యల్లందూరుకి  చెందిన రాణి.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో ధనుంజయ్ అనే వ్యక్తి టీచర్ గా చేస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహమైనప్పటికీ ఆ విషయాన్ని దాచి రాణికి ప్రేమ పేరిట దగ్గరయ్యాడు.

Also Read సుడిగాడు: చావును నెత్తిమీద పెట్టుకుని.. 11 కిలోమీటర్ల ప్రయాణం...

పెళ్లి చేసుకుంటానని ఆమె నుంచి రూ. లక్షల నగదు తీసుకున్నాడు. ఇటీవల రాణికి హాసన్‌ జిల్లాకు బదిలీ అయ్యింది. దీంతో పెళ్లి చేసుకుందామని పలుమార్లు ధనుంజయ్‌ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానించిన రాణి తన సోదరుడు రాకేశ్‌కు విషయం చెప్పడంతో అతను ధనుంజయ్‌ గురించి ఆరా తీయడంతో అతనికి అప్పటికే పెళ్లి జరిగినట్లు తేలింది.

 దీంతో రాణి రెండు రోజుల క్రితం ధనుంజయ్‌తో గొడవపడింది. నన్ను మోసం చేశావని నిలదీసింది. ఊరికే వదలనని హెచ్చరించి హాసన్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది విషం తాగింది. దీంతో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో రాణి సోదరుడు రాకేశ్‌ ఈ ఘటనపై బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.