Asianet News TeluguAsianet News Telugu

టాటాల ఆవిష్కరణ: 40 నిమిషాల్లోనే కరోనా రిజల్ట్

అనుమానితుడికి కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా గుర్తించేందుకు వీలుగా టాటా మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌ (టాటా ఎండీ), అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ కరోనా కిట్‌లను దిల్లీలో ప్రారంభించారు

tatas Feluda paper strip test kit fo Covid19 launched in delhi ksp
Author
New Dehli, First Published Nov 19, 2020, 2:30 PM IST

అనుమానితుడికి కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా గుర్తించేందుకు వీలుగా టాటా మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌ (టాటా ఎండీ), అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ కరోనా కిట్‌లను దిల్లీలో ప్రారంభించారు.

‘టాటా ఎండీ చెక్’ పేరిట దీనిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా కేవలం 40 నిమిషాల్లోనే ఫలితాన్ని నిర్ధారించొచ్చు. ధర కూడా ప్రస్తుతమున్న ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు కిట్ల కంటే తక్కువగా ఉంటుందని టాటా గ్రూప్‌ వెల్లడించింది.

సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ టెక్నాలజీ ద్వారా దీనిని అభివృద్ధి చేశారు. ఇది ఇంట్లో సాధారణంగా గర్భ నిర్ధారణ చేసుకునే కిట్‌ మాదిరిగా ఉంటుంది. బాధితుడి నుంచి స్వాబ్‌ను సేకరించాక థర్మోసైక్లింగ్‌ విధానంలో దాని నుంచి ఆర్ఎన్‌ఏను వేరు చేస్తారు.

అనంతరం ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ కిట్‌పై ప్రయోగిస్తే దానిపై ఉండే బార్‌కోడ్‌ ఆధారంగా కరోనాను నిర్ధారించే వీలుంటుంది. దీనికోసం ల్యాబ్‌లు అవసరమైనప్పటికీ, చిన్నిపాటి మొబైల్‌ ల్యాబ్‌ల ద్వారానూ పరీక్షించవచ్చని టాటాఎండీ తెలిపింది.  

ఈ కిట్‌ భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) అనుమతి పొందినట్లు టాటాఎండీ వెల్లడించింది. ‘‘విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీగల ప్రాంతాల్లో వీటిని ఉపయోగించొచ్చు.

98 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని టాటా పేర్కొంది. పాజిటివ్‌, నెగటివ్‌ కేసులు రెండింటినీ ఇది గుర్తించగలదని చెప్పింది. నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని.. అదే సమయంలో నిర్దిష్టమైన ఫలితాలను అందిస్తుందని టాటా ఎండీ వెల్లడించింది.

ఇదే రకమైన కిట్లను అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉపయోగిస్తోందని గుర్తు చేసింది. త్వరలో తమిళనాడుకు ఈ కిట్లను సరఫరా చేయబోతున్నట్లు చెప్పింది. కోటి కిట్లకు ఆర్డర్లు వచ్చాయని, ఈ మేరకు సురక్షిత వాతావరణంలో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టాటాఎండీ వివరించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios