దీపావళి పర్వదినం రోజున మందుబాబులు రెచ్చిపోయారు. టపాసులకన్నా మద్యం అమ్మకాలు జోరుగా సాగడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే.. ఈ  సంవత్సరం రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం గమనార్హం. దీపావళి సమయంలో తమిళనాడు రాష్ట్రంలో రెండు రోజలు పాటు రూ.466 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి.

గత ఐదు సంవత్సరాలలో దీపావళిలో ఇంత మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. యేటా సంక్రాంతి, దీపావళి పండుగ రోజుల్లో టాస్మాక్‌ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. పండుగ సందర్భంగా టాస్మాక్‌ సంస్థ మద్య పానప్రియులను ఆకట్టుకునేరీతిలో కొత్త బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయిస్తుంది. 

ఆ మేరకు ఈ యేడాది దీపావళికి కొత్త రకం బ్రాండ్లను టాస్మాక్‌ దుకాణాలలో విక్రయించారు. గత శుక్ర, శనివారాల్లో రాష్ట్రమంతటా టాస్మాక్‌ దుకాణాల్లో  మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. శనివారం ఊహించని రీతిలో అత్యధికంగా మద్యం విక్రయించారు.

చెన్నైలోని టాస్మాక్‌ దుకాణాల్లో శుక్రవారం సుమారు రూ.44.25 కోట్ల మద్యం విక్రయించారు. ఇదేవిధంగా తిరుచ్చి నగరంలో రూ.47.37 కోట్లు, సేలంలో రూ.43.26 కోట్లు, మదురైలో రూ.51.25 కోట్లు, కోయంబత్తూరులో రూ.43 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగాయి. ఈ యేడాది సుమారు రూ.400 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని టాస్మాక్‌ ఉన్నతాధికారులు అంచనావేశారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.466 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి.