Tamil Nadu urban civic polls: తమిళనాడులో జ‌రుగుతున్న‌ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కోలీవుడ్ న‌టుడు విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కారులో రావడంతో ఆయన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు. పోలింగ్ బూత్ వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో ఆయన క్షమాపణ చెప్పారు.  

Tamil Nadu urban civic polls: దాదాపు ప‌దేండ్ల‌ విరామం తరువాత తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. భారీ బందోబ‌స్తు న‌డుమ ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. చెన్నైతో సహా 21 నగరాలకు, 138 మున్సిపాలిటీలు, 490 నగర పంచాయతీల్లో పోలింగ్ జ‌రుగుతోంది. గత ఐదేళ్లలో ఎన్నికలు జరగకపోవడంతో.. ఈ స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులు లేరు. ఈ పోలింగ్‌ ద్వారా 12 వేల కన్నా ఎక్కువ మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నిక‌లు అధికార డిఎంకె ప్రతిష్టాత్మకంగా మారాయి. 

ఈ ఎన్నిక‌ల్లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి.. ఓట‌ర్లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ త‌రుణంలో కోలీవుడ్ స్టార్ విజయ్ తన ఓటును వినియోగించుకున్నారు. అయితే త‌మ అభిమాన న‌టుడు విజయ్ చూసి.. ఆయ‌న‌తో ఫోటోలు దిగ‌డానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉన్న సాధారణ జనాలకు ఇబ్బంది కలిగింది. తనవల్ల కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ వెంటనే అక్కడున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఎన్నికలలో విజ‌య్ అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో అభిమానుల సంఘం అయిన “తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం” (TVMI) జెండా, పేరును ఉపయోగించడానికి అభిమానులు నటుడి అనుమతిని కోరారు. ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 

మరోవైపు .. కొన్ని నెలల క్రితం, విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ “ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం” అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయ‌న‌ సెక్రటరీ జనరల్‌గా, తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. అయితే, విజయ్ తన పేరును రాజకీయ అజెండాలో ఉపయోగించుకున్నందుకు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. విజయ్ తన పేరుపై ఉన్న తండ్రి పార్టీని రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు

ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో విజయం సాధించాల‌ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భావిస్తున్నారు. ఎలాగైనా గెలిచి.. త‌మ ఖాతాలో గెలుపు వేసుకోవాలనే లక్ష్యంగా పనిచేశారు. తమ సత్తా చాటాలని ప్రతిపక్ష అన్నాడిఎంకె ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ నేపధ్యంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంచుతుందని వార్తలు వస్తున్నాయి.