చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీ కొడుకుల కస్టడీ డెత్ పై సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ దర్యాప్తు నివేదికను సీబీఐ కోర్టుకు అందించింది.

రాష్ట్రంలోని సత్తాన్ కులం పోలీస్ స్టేషన్ పరిధిలో బెనిక్స్, జయరాజ్ లను పోలీసులు  ఈ ఏడాది జూన్ 19వ తేదీన (19.06.2020) అరెస్ట్ చేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో వీరిని అరెస్ట్ చేశారు.

ఎస్ఐ బాలకృష్ణన్, సీఐ శ్రీధర్, కానిస్టేబుల్ ముత్తురాజాతో పాటు మరికొందరు పోలీసులు కామరాజార్ చౌక్ వద్ద జయరాజ్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కొడుకు బెనిక్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

అప్పటికే జయరాజ్ ను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. తన తండ్రిని కొడుతున్న విషయమై బెనిక్స్ ప్రశ్నించాడు. దీంతో బెనిక్స్ పై  కూడ పోలీసులు దాడి చేశారు.

తండ్రీ కొడుకులను  విపరీతంగా కొట్టారు. జూన్ 19వ తేదీ రాత్రి 7:45 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు కొట్టారని సీబీఐ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు.

పోలీస్ స్టేషన్ లాకప్, టాయిలెట్, ఎస్ హెచ్ ఓ గదిలోని గోడలపై సేకరించిన రక్త నమూనాలు, మృతుల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్టుగా సీబీఐ తెలిపింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నిపుణులు కూడ ఈ విషయాన్ని ధృవీకరించినట్టుగా పేర్కొంది.

తీవ్రమైన గాయాల కారణంగా వీరిద్దరూ మరణించారని పోస్టుమార్టం నివేదిక కూడ స్పష్టం చేసింది. ఈ విషయమై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం ఈ విషయమై సీబీఐ విచారణకు ఆదేశించింది.