పిల్లల జీవితం బాగుండాలని, వారి భవిష్యత్తుకు పునాది వేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఖర్చు ఎక్కువైనప్పటికీ కార్పోరేట్ స్కూళ్లలోనే చేరుస్తారు. అలాంటిది ఒక జిల్లాకి కలెక్టర్‌గా ఉండే వ్యక్తి తన పిల్లలను ఎక్కడ చదివిస్తారు.

జిల్లాలోనే అత్యుత్తమ పాఠశాలను ఎంపిక చేసి మరీ అక్కడ చేరుస్తారు. కానీ తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీశ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన శిల్ప తిరునెల్వేలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆమె శ్రమ ఫలించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా తన కూతురిని అంగన్‌వాడీలో చేర్పించారు.

దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. ‘‘అంగన్‌వాడీల్లో పిల్లలను చేర్చాలని చెప్పేది మేమే కదా’’ అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

మా ఇంటికి దగ్గర్లో ఉన్న కేంద్రంలో మా కూతురిని చేర్పించాం.. తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉండటం నేర్పించాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచి ఉపాధ్యాయులను నియమించామని. చిన్నారుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు శిల్ప తెలిపారు.