వీధి కుక్కపై దాడి చేసి, దాని చూపు కోల్పొయేందుకు కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కుక్కపై దాడి చేసి దానిని రోడ్డు వెంట ఈడ్చుకెళ్తున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. 

ఓ వీధి కుక్కపై రైతు దాడి చేయ‌డంతో అది కంటి చూపు కోల్పొయింది. దీంతో ఆ రైతును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో గురువారం చోటు చేసుకోగా.. తాజాగా పోలీసులు ఆయ‌నను అరెస్టు చేశారు. 

దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. త‌మిళ‌నాడు (tamilnadu) రాష్ట్రంలోని కోయంబత్తూరు (Coimbatore) జిల్లా వీరకేరళా (veerakerala)నికి చెందిన 40 ఏళ్ల వి బాలు (v.balu) ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిగా ఉన్నాడు. ఆయ‌న గురువారం రోజు ఓ వీధి కుక్క‌పై దాడి చేశాడు. అనంత‌రం దానిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఓ మ‌హిళ ఉన్నారు. ఆమె చేతిలో ఓ దుంగ ప‌ట్టుకొని ఉన్నారు. అయితే ఈ చ‌ర్య‌ల‌న్నీ అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో శుక్ర‌వారం సాయంత్రం నాటికి సోష‌ల్ మీడియా (social media) లో వైర‌ల్ గా మారింది. తీవ్రంగా గాయ‌ప‌డిన కుక్కకు సంబంధించిన వీడియోను చూసిన జంతు కార్యకర్త మినీ వాసుదేవన్ వాడవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు బాలు, ఆయ‌న‌ తల్లి సెల్వి (65)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జంతు హింస నిరోధక చట్టం 1960లోని సెక్షన్ 11(ఎ) (జంతు హింస) (I) (ఏదైనా జంతువును ఛిద్రం చేయడం లేదా వీధికుక్కలతో సహా ఏదైనా జంతువును చంపడం) కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రాంతంలో వీధికుక్కల బెడద గురించి బాలుకు ఆయ‌న తల్లిదండ్రులు చెప్పార‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. జంతు కార్య‌క‌ర్త మినీ వాసుదేవ‌న్ (mini vasudevan) తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కుక్కను దుంగతో బలంగా కొట్టడంతో దాని తలకు బలమైన గాయమైంది దీంతో త‌ల‌పై వాపు వ‌చ్చింది. కుక్క కుడి కంటి చూపు కోల్పోయింది. కుక్క ఎడమ కన్ను పాక్షికంగా దెబ్బతింది. దీంతో ఆ కుక్క‌ను సంర‌క్ష‌ణశాల‌కు త‌ర‌లించామ‌ని ఆమె తెలిపారు. 

ఇదిలా ఉండగా.. గత నెలలో మధ్యప్రదేశ్‌ (madya pradhesh)లోని ఇండోర్‌ (indor)లో వీధికుక్కను ఓ వ్య‌క్తి క‌త్తితో పొడిచి చంపాడు. దీంతో అత‌డిపై పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. నిందితుడిని ఇండోర్‌లోని భగీరథ్‌పురా ప్రాంతానికి చెందిన రాజేంద్రగా గుర్తించారు. ఆయ‌న న‌డుకుంటూ వెళ్తూ ప్ర‌శాంతంగా నిద్రిస్తున్న ఓ వీధి కుక్క కడుపులో కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న‌పై కొంత మంది స్థానికులు, జంతు ప్రేమికులు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత‌డిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. 

ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్‌(Kurnool)లో జిల్లాలో వీధి కుక్కలను అతి కిరాతకంగా కర్రలతో బాది చంపేస్తున్నారని (Beaten to death) పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. పట్టణంలో మున్సిపల్ సిబ్బంది కుక్కలను దారుణంగా చంపేస్తున్నారని ఎన్‌జీవో వాక్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 10వ తేదీన సుమారు 12 గంటల ప్రాంతంలో కుక్కలను కొట్టి చంపారని ఆరోపించింది. మున్సిప‌ల్ సిబ్బంది దాదాపు 50 కుక్కలను పట్టుకున్నారని, చట్టానికి వ్యతిరేకంగా వాటిని కొట్టి చంపేశారని తెలిపింది. వెంట‌నే దీనిని అరిక‌ట్టాల‌ని కోరింది.