స్వీట్ల మీద వెండిపూత, బంగారు పూత తెలిసిందే. అయితే అవి చాలా తక్కువ క్యారెట్స్ తో చేసి వేస్తారు. కానీ సూరత్ లోని ఓ స్వీట్ షాపు కొత్త ప్రయోగం చేసింది. అక్కడి చాందీ పాద్వో పండుగ సందర్భంగా 24 కారెట్ల బంగారం పైతొడుగుతో స్వీటును తయారు చేసింది. దానికి ‘గోల్డ్‌ ఘారీ’ అని పేరు పెట్టింది. 

శరద్‌ పూర్ణిమ తర్వాతి రోజైన చాందీ పాద్వో రోజున సాంప్రదాయ వంటకం ‘ఘారీ’ తినటం అక్కడి ప్రజల ఆనవాయితీ. ఈ సారి దీన్ని కాస్త ప్రత్యేకంగా తయారుచేయాలనుకున్నాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన రోహన్‌ అనే స్వీట్‌ షాపు యజమాని. ప్రత్యేకంగా ఉండాలని బంగారంతో స్వీటును తయారు చేశాడు. మామూలు ఘారీ కిలో ధర 660-900 రూపాయల వరకు ఉంటే.. కిలో ‘గోల్డ్‌ ఘారీ’ ధర 9000 రూపాయలు. 

దీనిపై రోహన్‌ మాట్లాడుతూ.. ‘‘ మేము ఈ సంవత్సరమే ‘ గోల్డ్‌ ఘారీ’ని తయారు చేశాము. ఇది చాలా ఆరోగ్యకరం. బంగారం ఎంతో ఉపయోగకారని మన ఆయుర్వేదమే చెబుతోంది. ఈ స్వీటును మార్కెట్‌లోకి తెచ్చి మూడురోజులవుతోంది. మేము అనుకున్న దానికంటే తక్కువ డిమాండ్‌ ఉంది. రానున్న రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నా’’మన్నారు.