బిల్కిస్ బానో పిటిషన్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను 27న సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుంది. 

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురి హత్యకు సంబంధించిన కేసులో 11 మంది నిందితులను సత్ప్రవర్తన కింద విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బిల్కిస్ బానోతోపాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను మార్చి 27వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ జరిగింది. అదే సమయంలో ఆమె కుటుంబానికి సంబంధించిన ఏడుగురిని మూక హత్య చేసింది. 

బిల్కిస్ బానో రిట్ పిటిషన్ సహా పలువురు పౌర హక్కుల కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం విచారించనుంది.

ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి మార్చి 22న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించి ఆదేశాలు జారీ చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా లిస్టింగ్ చేసి కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి ఆదేశించారు.

జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం జనవరి 4వ తేదీన బిల్కిస్ బానో, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను టేకప్ చేసింది. కానీ, ఆ ధర్మాసనం నుంచి జస్టిస్ త్రివేది తప్పుకున్నారు. ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఆమె తప్పుకున్నారు.

బిల్కిస్ బానో కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ 11 మందిని సత్ప్రవర్తన పేరిట ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. గతేడాది నవంబర్ 30వ తేదీన ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.