Bilkis Bano Case: లొంగిపోవాలని కోర్టు ఆదేశం.. 9 మంది దోషుల పరార్
బిల్కిస్ బానో కేసులో క్షమాభిక్ష కింద విడుదలైన దోషులంతా తిరిగి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఈ నెల 8వ తేదీన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో దోషుల ఇంటి వద్ద ముందస్తుగానే కానిస్టేబుళ్లు కాపలా కాశారు. కాగా, జనవరి 7వ తేదీన వారంతా ఊరి నుంచి పారిపోయారు.
Supreme Court: గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష పెట్టి బిల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేయడాన్ని తప్పు పట్టింది. వెంటనే వారంతా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడ్డ గంటల వ్యవధిలోనే 9 మంది దోషులు కనిపించకుండా పోయారు. ఇంటికి తాళాలు వేసుకుని పారిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
8వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఉండటంతో ప్రతి దోషి వద్ద ఓ పోలీసు కానిస్టేబుల్‌ను మోహరించారు. వారికి కాపలగా ఉంచారు. అయినా.. వారు లొంగిపోవాలని తీర్పు వచ్చినప్పటికీ కాపలాగా పోలీసులు ఉన్నప్పటికీ 9 మంది దోషులు మిస్ కావడం చర్చనీయాంశం అవుతున్నది. మొత్తం 11 మంది దోషులకు గాను 9 మంది దోషులు అజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు సంచలనమైంది.
గోవింద్ నాయ్ అనే దోషి తండ్రి మీడియాతో మాట్లాడుతూ తమ కొడుకు వారం క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు. మరో దోషి రాధేశ్యామ్ గత 15 నెలలుగా ఇంటికి రావటం లేదని ఆయన తండ్రి భగవన్ దాస్ వివరించాడు. కానీ, ఇవన్నీ అవాస్తవం అని, వారి మాటల్ని స్థానికులు తోసిపుచ్చారు. గోవింద్ నాయ్, రాధే శ్యామ్ జనవరి 7వ తేదీ వరకూ ఊళ్లల్లోనే ఉన్నారని వివరిస్తున్నారు.
Also Read: AP News: అయ్యో దేవుడా! చిన్నారిని కబళించిన నిమ్మకాయ.. ఏడేళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కూతురు
కాగా, దోషులందరూ అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పలేమి, కొందరు బంధువుల వద్దకు వెళ్లి ఉంటారనీ దాహోద్ జిల్లా ఎస్పీ వివరించారు. తమకు ఇంకా సుప్రీంకోర్టు కాపీ అందలేదని పేర్కొన్నారు. బిల్కిస్ కుటుంబం రాంధిక్‌పుర్‌లో నివసించేది. దోషులు కూడా ఇదే జిల్లాలోని రాంధిక్‌పుర్, సింగ్వాద్ గ్రామాలకు చెందినవారే.