న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు తాజాగా మరో సంచలన తీర్పుఇచ్చింది. మహిళ అంగీకారంతో సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కింద రాదని స్పష్టం చేసింది. 

బుధవారం సహజీవనంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని ప్రకటించింది.  

సేల్స్‌టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయిన ఓ మహిళ సీఆర్పీఫ్ డిప్యూటీ కమాండెంట్‌తో ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. వీరిద్దరూ ఒకరి ఇళ్లలో మరొకరు నివాసముంటూ సహజీవనం చేసుకున్నారు. 

అయితే సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో సహజీవనం చేసిన మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బలవంతంగా తనతో శారీరక సంబంధం ఏర్పరచుకొని ఆరేళ్లపాటు సహజీవనం చేసి ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని సుప్రీం కోర్టు వద్ద వాపోయింది. 

ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్డు బెంచ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరాబెనర్జీల ధర్మాసనం అత్యాచారం కేసును కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మహిళ అంగీకారంతోనే సహజీవనం చేస్తూ, శారీరక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కింద రాదని ప్రకటించింది. 

ఇకపోతే వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు ఇటీవలే తేల్చిచెప్పింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్‌ 497ను కొట్టేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎవరైనా ఇష్టపూర్వక శృంగారం చేస్తే దాన్ని నేరంగా పరిగణించలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.